వాస్తవాలు తెలిసినా అంగీకరించకపోవడం, నిరాకరించడం మోసగించడమే. అసత్యం చెప్పడంలో ట్రంప్ మినహా మోదీని మించిన వారెవరూ లేరు. ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా, ఇస్రాయెల్ యుద్ధం ప్రారంభించిన వెంటనే మనం కూడా పెట్రోల్, డీసెల్, గ్యాస్ కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని అందరికీ తెలుసు. కానీ ప్రధానమంత్రి మోదీ ఈ వాస్తవాన్ని నిరాకరిస్తూ వచ్చారు. మనకు ఇబ్బంది ఏమీ లేదని నమ్మబలికారు. మన దగ్గర గ్యాస్, పెట్రోల్, డీసెల్ ధరలు పెంచే ప్రసక్తి లేదని బూటకపు భరోసా ఇచ్చారు. అయిదు శాసనసభల ఎన్నికలు ముగిసిన వెంటనే మే ఒకటవ తేదీన వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను అపూర్వమైన రీతిలో 993 రూపాయలు పెంచేశారు. వంట గ్యాస్, పెట్రోల్, డీసెల్ ధరలు పెంచే ప్రసక్తే లేదని మోదీతో పాటు ఆయన వంది మాగధులు బాకాలూదారు. ఇప్పుడవన్నీ ముగిశాయి. వీటి ధరలు పెంచడానికి కావలసిన ప్రాతిపదిక ఏర్పాటు చేయడానికి మోదీ హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభను ఎంపిక చేసుకున్నారు. యుద్ధం ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో పూసగుచ్చినట్టు ఏకరువు పెట్టారు. ఆయన ఏకరువు పెట్టిన అంశాల్లో ఇసుమంత అబద్ధం కానీ, అతిశయోక్తి కానీ లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా సంకట స్థితిలో ఉందని మోదీ బహిరంగంగానే అంగీకరించారు. అప్పుడు వీరే అనేక దేశాలలో చమురు, గ్యాస్ ధరలు పెంచేసినా మన దేశంలో మాత్రం మోదీ ప్రభుత్వం పెంచలేదని మోదీ భజనపరులు కీర్తిగానంలో మునిగి తేలారు. సంకటం మొదలై దాదాపు రెండున్నర నెలలు దాటింది. మరి కొన్ని నెలల దాకా ఎక్కడా ఎన్నికలు లేవు కనక దేశం ఎంత విపత్కర పరిస్థితుల్లో ఉందో మోదీ అత్యంత వ్యథాభరిత రీతిలో వివరించారు. దేశభక్తి అంటే కేవలం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేయడం, జైళ్లకెళ్లడం మాత్రమే కాదని ప్రజలు తమ కర్తవ్యం నిర్వహించడం, దేశం కోసం జీవించడం కూడా దేశభక్తేనని మోదీ ప్రవచనం చెప్పారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం పెట్రో రసాయనాల దిగుమతిని సైతం దెబ్బ తీసింది. రసాయనిక ఎరువుల సరఫరాకు కొరత ఎదురవుతోంది. దీన్ని నివారించడానికి మోదీ ఓ ఉపాయం కనిపెట్టారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూసారం దెబ్బ తింటుందట. అది నిజమే. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడానికి సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని అవలబించాలట. అదీ మంచిదే. కానీ ఇంత సువిశాలమైన దేశంలో సేంద్రీయ వ్యవసాయం చేయడానికి వీలు కల్పించే పశు సంపద ఎక్కడ ఉంది ? అటవీ సంరక్షణ ఊసే లేదుగా! విదేశీ సరుకులు వాడడం కన్నా స్వదేశీ వస్తువులే వినియోగిస్తే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చునన్నారు. హైదరాబాద్‌లో మోదీ ప్రసంగం నిశితంగా పరిశీలిస్తే సంకట స్థితిని ఆయన అంగీకరించక తప్పలేదని రుజువు అయింది. మోదీ విదేశీ, మేక్ ఇన్ ఇండియా మంత్ర జపంలో దిగబడిపోయారు. హైదరాబాద్ వేదికగా మోదీ సుద్దులు చెప్పడానికి మరో కారణం కూడా ఉంది. దీర్ఘకాలం నుంచి బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవాలన్న బీజేపీ ఆశ ఫలించింది. ఇక తెలంగాణ మీద దృష్టి సారించినట్టు స్పష్టంగా కనిపించింది. సంకట స్థితిని ఎదుర్కోవడానికి మోదీ ఏడెనిమిది సూత్రాలు ప్రవచించారు. విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఖర్చు కాకుండా ఉండాలంటే చమురు వాడకం తగ్గించాలట. సొంత వాహనాలు వాడకుండా మెట్రో రైళ్లను వినియోగించాలట. కానీ మెట్రో రైలు వ్యవస్థ ఎన్ని నగరాల్లో అందుబాటులో ఉందో మోదీ ఆలోచించినట్టు లేదు. కేవలం 15 నగరాల్లో మాత్రమే మెట్రో రైలు వ్యవస్థ ఉంది. ఈ సదుపాయాన్ని పొడిగించాలని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నా కేంద్రం నుంచి అనుమతులు ఊడిపడడం లేదు. అలాగే పండగలకు పబ్బాలకు, పెళ్లిళ్లకు సైతం బంగారం కొనగూడదట. ఈ మాట కేవలం ఎగువ మధ్య తరగతి వారికి, సంపన్నులకే వర్తిస్తుంది. పది గ్రాముల బంగారం లక్షన్నర రూపాయలు పలుకుతున్నప్పుడు సామాన్యులు కనీసం కలలో కూడా బంగారం కొనాలని ఆశించలేరు. కార్లు వాడడం తప్పని సరి అయితే కార్ పూలింగ్ చేసుకోవాలట. అన్నింటికన్నా మించి ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోం) చేయాలట. అంటే మోదీ కరోనా కాలాన్ని గుర్తుకు తెచ్చారు. మంగళవారం అస్సాంలో హేమంత బిస్వశర్మ మంత్రివర్గం రేపు ప్రమాణం స్వీకరించనుంది. మోదీ అక్కడికి వెళ్లి అట్టహాసం చేయకుండా తన కార్యాలయం నుంచో, ఇంటి నుంచో ఆ వేడుకను చూసి “వాచ్ ఫ్రం” అంటే ఏమిటో చూపించొచ్చుగా! మోదీ హాజరైతే ఎన్ని వాహనాలు వాడతారో! అవన్నీ మంచినీళ్లతో నడవవుగా. అంతెందుకు ఆదివారం సుద్దులు చెప్పిన మోదీ సోమవారమే గుజరాత్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం కోసం మోదీ, అమిత్ షాతో పాటు తక్కుంగల బీజేపీ నేతలందరూ ఎన్ని ప్రైవేటు విమానాలు, హెలీకాప్టర్లు వాడుకున్నారో జనం గమనించలేదనుకుంటే ఎలా! వంట నూనెల వాడకం తగ్గిస్తే ఆరోగ్యానికి కూడా మంచిదట. ఇది పస్తులుండే వాడికి పథ్యం పెట్టడమే. సరుకుల రవాణాకు కూడా రైల్వేలనే ఉపయోగించుకోవాలని మోదీ సలహా పారేశారు. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని కూడా కోరారు. మోదీ సూచించిన ఈ పథ్యాలన్నీ ఏడాది పాటు పాటించాలట. అంతకాలం మోదీ రోడ్ షోలు మానేస్తారా ? పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో ఈ తతంగం అంతా జరగకుండా ఆపేస్తారా ? ఆ తరవాత బ్రహ్మాండమైన మార్పు ఏమైనా వస్తుందా ? గత రెండు నెలల కాలంలో ఎన్నికల ప్రచార సందర్భంగా తాను, తన పార్టీ నాయకులు ఎన్ని రోడ్ షోలు చేశారో, ఎన్ని లక్షల లీటర్ల పెట్రోల్, డీసెల్ తగలేశారో మాత్రం చెప్పరు. బస్సులు, లారీలు పెట్టి జనాన్ని తరలించారో! రెండు నెలల నుంచి పెట్రోల్ తదితర ఇంధనాల ధరలు పెంచకుండా మోదీ ప్రభుత్వమే భారం మోసిందట. ఆ భారమూ అంతిమంగా ప్రజా ధనంతోనేగా! వచ్చే శుక్రవారం మోదీ ఏడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్వీడన్, నెదర్లాండ్స్, నార్వే, ఇటలీ దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. అది మానుకుని ఇంధనం, ఇతర ఖర్చులు ఆదా చేస్తారా ? ఒక్కో విదేశీ పర్యటనకు అన్ని వందల, వేల కోట్లు ఖర్చవుతున్నాయో! 12 ఏళ్ల పాలనలో చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి ఇప్పుడు జనం ఏం కొనాలో, ఏం తినాలో మోదీ చెప్పడం హాస్యాస్పదం. కానీ సంకట స్థితి నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ఏం చేయబోతోందో ఒక్క మాటైనా మోదీ చెప్పలేదు.


