నైజీరియా: నైజారియా సైన్యం జంఫారా రాష్ట్రంలోని రద్దీగల మార్కెట్‌పై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 100 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని అక్కడి యంత్రాంగాన్ని కోరింది. అనేక మంది గాయడ్డారని, వారికి సమీపంలోని జుర్మీ, షింకాఫీ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆమ్నెస్టీ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, బాలికలే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై నైజీరియా సైన్యం వెంటనే స్పందించలేదు. పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని గతంలో వివరణ ఇచ్చుకుంది. ఉగ్రవాదులు లక్ష్యంగా నిఘా వర్గాల సమాచారం ఆధారంగా వైమానిక దాడులు జరిపినట్లు వెల్లడించింది. అయితే సాక్షులు చెప్పినదాని ప్రకారం ఆమ్నెస్టీ ప్రకటన వెలువడింది. మధ్యాహ్నం సమయంలో మార్కెట్ ప్రాంతం వద్ద గగనతలంలో సైనిక విమానాలు చక్కర్లు కొట్టాయి. ఆపై రెండు గంటల తర్వాత దాడులు జరిగినట్లు ప్రకటన తెలిపింది. ఇదే తరహా దాడి ఏప్రిల్‌లో జిల్లీ మార్కెట్‌లో జరిగింది. ఆ దాడిలో 200 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక దాడుల్లో పౌరుల మరణాలు పెరుగుతుండటంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత 17 ఏళ్లుగా దోపిడీదారులకు నైజీరియా సైన్యానికి మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఇస్లామిస్ట్ స్థావరాలంటూ అమెరికా గతేడాది క్రిస్మస్ రోజున నైజీరియాలో దాడులు చేసింది. క్రైస్తవులకు రక్షణ కల్పించడంలో నైజీరియా విఫలమవుతున్నట్లు అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. ఈ తరహా దాడులు మానవహక్కుల తీవ్ర ఉల్లంఘనగా ఆమ్నెస్టీ వెల్లడించింది. రెండు సాయుధ సంఘాల మధ్య పౌరులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. వైమానిక దాడులను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంది. పౌరుల ప్రాణాలకు రక్షణకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
నైజీరియా సైనిక వైమానిక దాడిలో100 మంది పౌరుల మృతి: ఆమ్నెస్టీ
- Advertisement -
RELATED ARTICLES


