చింతపట్ల సుదర్శన్
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ పరవశించిపోయేట్టు, పరవశంగా కళ్లుమూసుకుంది డాగీ రోడ్డు మీద దొరికిన బ్రెడ్డు తింటూ. ఉన్నటుండి ఏదో వస్తువు వెన్ను మీద దభీమని పడ్డంతో ఉలిక్కి పడి రోడ్డుకు మరోవైపు పరుగెత్తి నిలబడి చూసింది. తనను అటాక్ చేసిన ‘టెర్రరిస్టు’ ఎవరా అని. తను ఇందాక నిలబడిన చోట ఓ వస్తువు ఎండకి మెరుస్తున్నది. ఏంటో వెళ్లి చూస్తే పోయేదేముంది అనుకుని చుట్టూ ఓ లుక్కు వేసి వెళ్లింది. రోడ్డు మీద తన ‘బ్యాక్ పెయిన’కి కారణమైన ఆ వస్తువు పడుంది. అది ఒక కరెన్సీ కాగితాల కట్ట. చూస్తే కొత్తగా తాజాగా వుంది. ఇది డాంకీకి ప్రజెంటు చేస్తే ఎంత సంతోషిస్తుందో ‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం’ అంటుందేమో అనుకుంటూ ఆ కరెన్సీ బండిల్‌ని నోట కరుచుకుని అరుగువైపునకు అడుగులు వేసింది వడివడిగా. అరుగు మీద గాఢ నిద్రలో ఉంది డాంకీ. ఒకసారి ఓ ఇంట్లో ఓ మనిషి నా డబ్బు నా ముఖాన కొట్టు అన్నప్పుడు మరో మనిషి నోట్ల కట్టను ఆ ముఖాన విసిరికొట్లటం చూసింది కదా అదే స్టయిల్లో నోటిలో ఉన్న బండిల్‌ని డాంకీ ముఖాన విసిరి కొట్టింది సర్ప్రైజ్ ఇద్దామని. ఉలిక్కపడి లేచిన డాంకీ మళ్లీ ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధి, డ్రోనులు, విమానాలు అని గంతులేసింది. డోంట్ ఫియర్ మై డియర్ డాంకీ బ్రో వాడటు లాగీ వీడిటు పీకే ఆ యుద్ధ భయం మరిచిపో అదలా సాగుతునే ఉంటుంది కానీ నీ ముందున్న విందు భోజనం ఆరగించు అంది డాగీ, విందు భోజనమ్మా అంటూ కరెన్సీ కాయితాల కట్టను పరీక్షగా చూసింది డాంకీ. ఏంటి బ్రో ? ఇదెక్కడ్నించి కొట్టుకొచ్చావు నన్ను శ్రీకృష్ణుడి ‘బర్త్ ప్లేస’కు పంపాలనుకుంటున్నావా యేం. ఓ పార్టీతో జత కట్టి, పదవుల కోసం వెన్నపోటు పొడిచే పొలిటీషన్ల బుద్ధి నీకెట్లా అబ్బింది రోయ్ అని ఓండ్ర పెడుతూ పెద్ద పెట్టున ఏడవసాగింది డాంకీ. అదేంటి బ్రో ఆవురావురంటూ తింటావని ప్రేమగా తెచ్చేను కానీ నమ్మక ద్రోహం చెయ్యాలని కాదు అంది డాగీ. తెలిసి చేసినా తెలీక చేసినా తప్పు తప్పే కదా! ముప్పు ముప్పేకదా! ఈ కరెన్సీ కట్ట ఏ పెద్ద తలకాయ ఇంట్లోనో ‘ఈడీ’ సోదాకి వెళ్లినప్పుడు పైనుంచి విసిరి పారేసిందేమో! ఏ ‘ఐటీ రైడ’ నించి తప్పించుకోడానికి పై కిటికిలో నుంచి కిందకి దొర్లించిందేమో అంది డాంకీ. ఏ సోదాలో విసిరేసిందైతేనేం ? ఏ కిటికీలోంచి దొర్లిందయితేనేం? మనకేం సంబంధం నమిలేసెయ్యి నేను ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అంటాను. అంతే! అని డాగీ అంటుంటే అరుగు ఎక్కాడు అబ్బాయి. ఏంటి డాగీకి సంస్కృతం కూడా వచ్చేస్తున్నట్టుంది అంటూ, తన జాగాలో కూచున్నాడు. రాకేం చేస్తుంది. మనది వేద భూమి కదా మన తాటాకుల్నిండా ఉన్నది దేవభాషే కదా అంది డాంకీ. సర్లే ఇప్పుడు భాషా చర్చ ఎందుకు గాని, సందర్భమేమిటో చెప్పండి అన్నాడు అబ్బాయి. ఏం లేదు ! అదిగో ఆ నోట్ల కట్టే. బజార్లో దొరికింది కదాని, డాంకీకి డిన్నర్‌గా పనికొస్తుందని పట్టుకొచ్చా ! ఎన్నికలప్పుడు బ్యానర్ కట్టే వాళ్లను జనాన్ని మందలు మందలుగా సమావేశాలకు లాక్కు వచ్చే వాళ్లను ఎవరు పట్టించుకుంటారు. నిస్వార్థ సేవకు విలువే లేకుండా పోతున్నది అన్నది డాగీ . అదికాదు బ్రో నువ్వే చెప్పు ఈ కట్ట నల్లకట్టే కదా! అంటే బ్లాక్ మనీయే కదా మాఫియా మనీ కూడా కావచ్చు కదా. దీని జాడ పట్టుకు వచ్చిన వాళ్లకు ఇది నా కడుపులో గనక దొరికితే! ఆ విసిరేసినోడికి నన్ను ‘బినామీ’గా భావించి చెర్లపల్లికి పంపించవచ్చు కదా. అయినా అది ఎట్లాంటి పాపిష్టి సొమ్మో! మనుషులంటే గాడిదల్లా దొరికిన సొమ్ము దోచుకుని దాచుకుంటారు కాని, గాడిదనైన నాకా బుద్ధి ఇంటా వంటా లేదు మరి అంది డాంకీ. సొమ్మేదయితేనేం మింగి మాయం చేసే తెలివి ఒక్క మనుషులకేనా ‘పేటెంట’. ఎక్కడ పడితే అక్కడ అధికారులయితేనేం, నాయకులయితేనేం ఆఖరుకు కోర్టుల్లో న్యాయదేవతకు గార్డియన్లయిన జడ్జీలయితేనేం. ‘సొమ్ము భద్రం భవిత బంగారం’ అనడం లేదా. పదవిలో ఉన్నప్పుడు దోచుకోకపోతే మళ్లీ పదవిలోకి రాగలడా ఎవడైనా, ‘లైటు ఉండగానే బ్యాగు సర్దుకోమన్నారు’ కదా అంది డాగీ. పేదలు నివసించే ధనిక దేశం కదా మనది. ఎంత డబ్బు చేతులు మారింది ఎంత సొమ్ము స్విస్ బ్యాంకు చేరింది నల్లడబ్బు ఆచూకీ తీస్తాం తెస్తాం అందరికీ పంచేస్తాం అని సొల్లు కబుర్లు చెప్తారు కాని కొండను తవ్వేదెవరు. దేశం నిండా లెక్క తప్పిన లెక్క లేని సొమ్మే కదా గొంగడిలో వెంట్రుక కనపడనట్టు ఈ కట్ట నీ పొట్టలో కరిగి కనపడకుండా పోతుందిలే అంది డాగీ. మనది కానిది మనది ఎప్ప్పుడూ కాదు అందువల్ల అనవసరపు రిస్క్ ఎందుకు ? అని ఓటర్లను కొనడానికి వచ్చిన సొమÖ్మ, ఏ మహానాయకుడి బొమ్మనైనా మÖకుమ్మడిగా బహిరంగ సభలో ఊపేందుకు పంచవలసిన సొమ్మో ఏదయితేనేం పరుల సొమ్ము, పాపపు సొమ్ము మనకు వద్దే వద్దు అన్నాడు అబ్బాయి. పోనీ నువ్వు తీసుకోరాదు బ్రదర్ నిరుద్యోగ భృతి కింద జమ కట్టుకో అంది డాగీ. దిసీజ్ టూమచ్. ప్రతీ ఎన్నికలకూ ప్రామిస్ చేసేవాళ్లు ఇక ఏ అబద్ధపు హామీ ఇవ్వలేని స్థితి వచ్చినప్ప్పుడు ఈ హామీని అమలుపరుస్తారేమో చూద్దాం. అంతేకాని ఎవడి సొమ్మయితేనేం మెక్కడానికి. మాకు మాత్రమే హక్కు ఉందనుకునే నాయ ‘కులం’ కాదు మనది అంటూ అరుగు దిగాడు అబ్బాయి. ఏ పోలీసు వ్యానో వెతుక్కుంటూ ఇటు రాక ముందే ఈ కరెన్సీ కట్టను ఎక్కడైనా విసిరేసి రా! అంది డాంకీ.


