చింతపట్ల సుదర్శన్
ఎర్రటి సూరీడు తెల్లబడి, తెల్లబడిన సూరీడు కొండల వెనుక దాక్కోడంతో, ఆకాశంలో సీరియల్ బల్బుల్లా నక్షత్రాలు ఒక దాని తర్వాత ఒకటి వెలగసాగాయి. గోడల మీద వెలుతురు నీడలు మసకమసకగా అగుపడుతుంటే అరుగు చివరకంటా వచ్చి మైదానంలోకి చూసింది డాగీ. చీకటి పడుతున్నది. ఇంకా ఈ డాంకీ రాలేదు ఏమైనా జరిగి ఉంటుందా అని ఆలోచించసాగింది డాగీ. రోడ్ల మీద వాహనాలకు కుక్కల్ని చంపడం తేలికే కాని గాడిదల్ని కొట్టి పారిపోవడం అంత తేలిక కాదే. ఏమీ జరిగి ఉండదు. ఏ కొత్త పార్టీ బ్యానరో ‘టేస్టీ’గా ఉండి ఉంటుంది. నములుతూ టైం మరిచిపోయి ఉంటుందేమో అనుకుంది. మరచిపోవడమేంటి, చీకటి కమ్ముకోవడం కనపడదా ఏమిటి అనుకున్న డాగీకి మైదానంలో నుంచి వస్తున్న డాంకీ కనిపించింది. ‘థాంక్ గాడ్,’ ఏ ప్రమాదం జరగలేదు. అసలే రేప్లూ, కిడ్నాపుల కాలం కదా! అయినా గాడిదల జోలికి వచ్చే గాడిద ఎవడులే అనుకుంటూ ‘వెల్కమ్’ చెప్పింది డాంకీకి . ఏమిటింత లేటు అన్నయ్యా! అంది ఆప్యాయంగా. కావాలనేం లేటుగా రాలేదు. ఎన్ని గల్లీలు తిరిగానో, ఎంత సేపు తిరిగానో నాకే తెలీదు. ఇప్పటికి కనపడ్డది మైదానం, మైదానంలో మన ఈ కొంప అంది డాంకీì ఆయాసపడుతూ. అదేంటి ? ఇదేందయ్య ఇది. ఇది నేనెప్పుడూ వినలేదే అనాల్సి వస్తున్నది. ఉన్న ఊరినీ, పదవీ, డబ్బూ ఇచ్చిన పార్టీనీ మరచిపోవడానికి నువ్వేం రాజకీయ వస్తాదువి కావే అంది డాగీ చెవులు ఎగరేస్తూ. మరచిపోవడం! కరెకుట్! మరచిపోవడం అన్న మాట ఇప్పుడు గుర్తుకొచ్చింది. అదేంటో డాగీ ఎప్పటిలాగే ఇంటికి బయలుదేరా కానీ ఇల్లెక్కడున్నదీ గుర్తు రాలేదు. అమ్మ తోడు నీ మీదŠ ఒట్టు. ఎన్ని తిరుగుళ్లు తిరిగానో అంది డాంకీ. అవునా? నిజంగానే! ఇంటి దారి మరచిపోయావా? అంత పెద్ద తల ఉండీ ఆ తలలో బోలెడు బుర్ర ఉండీ మరిచిపోయావా అని ఆశ్చర్యపడ్డది డాగీ. మరచిపోవడానికి తలసైజు తలలో ఉన్న గుజ్జు ‘క్వాంటిటీ’ అక్కర్లేదు. ఎవరైనా, ఏదైనా, ఎపుడైనా మరచిపోవచ్చు అని డాంకీ అంటుంటే స్నేహితుల్తో కబుర్లాడి ఇంటికి వెళ్తున్న అబ్బాయి వచ్చి అరుగు ఎక్కాడు. నువ్వు చెప్పు బ్రో! మరిచిపోవడానికి, తలకి ఏమైనా సంబంధం ఉందా అంది డాంకీ. అస్సలు లేదు ఆకారానికీ, మతిమరుపునకు ఎలాంటి లింకూ లేదు. ఈ మతిమరుపు జబ్బుని డిమెన్షియా అంటారు. మన రాష్ట్రంలో నలభై శాతం మంది ఈ వ్యాధి బారిన పడబోతున్నారని తేల్చింది ఒక సర్వే. బాగుంది నువ్వు చెప్పింది మనుషుల సంగతి అంది డాగీ, ఎవరి సంగతైతేనేం ‘బి12’ అనే విటమిన్ లోపం వల్ల వస్తుందట ఈ జబ్బు అన్నాడబ్బాయి. అయితే అదేదో విటమిన్ లోపం వల్ల మనుషులకే కాదు డాంకీలకు కూడా మతిమరుపు వ్యాధి సోకుతున్నదన్న మాట అంది డాగీ. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన మాయదారి జబ్బేమి కాదులే. ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నూటికి నూరు శాతం ఈ జబ్బు ఎప్పటి నుంచో ఉన్నదే అన్నాడు అబ్బాయి. అదేంటి బ్రో తిమ్మిని బమ్మిని చేసేటోళ్లు, తడి గుడ¦తో గొంతులు కోసేటోళ్లు ఉండే జాతి కదా అది, వాళ్లకి ఈ జబ్బు ఎందుకు ఉంటుందిలే చోద్యం కాకపోతే అంది డాంకీ. అయ్యో అమాయకపు డాంకీ మతిమరుపు ఉండడం వేరు, మతిమరుపు నటించడం వేరు. రాజకీయాల్లో రాటు తేలినోళ్లంతా మతిమరుపు నటించడంలో ఆస్కారు అవార్డు అందుకో తగినవారే అన్నాడు అబ్బాయి. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదే మైదానంలో ‘మైక్’ ల్లో ఎన్ని హామీలు ఇచ్చేరు. ఎన్ని వాగ్దానాలు చేసేరు. ఒక్కటన్నా నిజం చేశారా అంది డాగీ. డాగీవైనా, తెలివైన ఓటరులా మాట్లాడావు. పబ్లిక్ మీటింగుల్లో ఆడిన మాటలను ఇళ్ల ముందుకు వచ్చి ఓటర్ల గడ్డం పుచ్చుకున్నప్పుడు చెప్పిన మాటలను ఎంత చులాగ్‌గా మరిచిపోతారో! అన్నాడు అబ్బాయి. అవునవును లక్షల ఉద్యోగాల సంగతి, నిరుద్యోగ భృతి విషయం ఎన్నికల రిజల్టు వచ్చిన మరుక్షణమే మరిచిపోతారు కదా ! అన్నది డాంకీ. తాము అన్న మాటల్ని ఎంత తేలిగ్‌గా మరిచిపోతారో! ఒక పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, మరో పార్టీలోకి వచ్చాక అస్సలు గుర్తుపెట్టుకోరు. కొందరికయితే ఇప్పుడు తాము ఉన్న పార్టీలోకి ఎన్ని పార్టీలు మార్చి వచ్చామో కూడా గుర్తు రాదు. మళ్లీ ఎన్నికలు వచ్చేవరకూ ఓటర్లు ఎవరో కూడా మరిచిపోతారు అన్నాడు అబ్బాయి. మతి ఉంటుంది కానీ మరుపుండదన్నమాట అంటే అబ్బాయి నువ్వన్నావే, ఆ అల్జీమర్సో, డిమెన్షియానో దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ నటించే జబ్బేన్న మాట అంది డాంకీ ! వాళ్లందరికీ ఉందేమో కానీ నీకు మాత్రం లేదు డాంకీ. మతిమరుపు జబ్బు పేరు ఎంత బాగా గుర్తుంచుకున్నావో అంటు నవ్వాడు అబ్బాయి.


