వివరాలు ఇవ్వాలని సిట్ చీఫ్‌కు లేఖ
ధనుంజయ, కృష్ణమోహన్, గోవిందప్పకు సుప్రీంలో ఎదురుదెబ్బ
కీలక వ్యక్తుల అరెస్టులపై సిట్ బృందం ఆరా
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. రూ.వేలకోట్లు అక్రమ మార్గంలో తరలించారన్న ఆరోపణలు రావడంతో మనీలాండరింగ్ నిరోధకం చట్టం
2002 కింద కేసు నమోదు చేస్తామని లేఖలో స్పష్టం చేసింది. పీఎమ్‌ఎల్‌ఏ సెక్షన్ కింద కేసు నమోదుకు తమకు డాక్యుమెంట్లు కావాలని సిట్ అధిపతి, విజయవాడ సీపీకి ఈడీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, ఇప్పటి వరకు సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల వివరాలు పంపాలని, మద్యం కుంభకోణంపై సీఐడీ అధికారులు నమోదు చేసిన 21/2024 ఎఫ్‌ఐఆర్‌కి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ కావాలని కోరింది. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది అరెస్టయ్యారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులకు మెమోలు జారీజేయాలని సిట్ భావించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని, ఆయన పీఏ పైలా దిలీప్‌ను అరెస్ట్ చేసింది. వీరిని కస్టడీలోకి తీసుకుని మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో మరికొన్ని అరెస్ట్‌లు జరిగాయి. పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు వారిని విచారించారు. మద్యం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, ఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తమకు మధ్యంతర రక్షణ కల్పించాలని హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది. రాష్ట్ర హైకోర్టులో ఈ కేసు పెండిరగ్‌లో ఉన్నందున అక్కడ తేల్చుకుని రావాలని సుప్రీం సూచించింది. ఈ ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వారు సుప్రీంలో పిటిషన్ వేసి… మధ్యంతర రక్షణ కల్పించాలని కోరగా… గతంలో వేసిన పిటిషన్‌ను సవరణ చేయాలని లేదా కొత్త పిటిషన్‌ను వేయాలని సుప్రీం తెలియజేస్తూ విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఈ ముగ్గురి కోసం సిట్ బృందం ఆరా తీస్తోంది. విజయవాడ, హైదరాబాద్‌లలో తీవ్రంగా గాలిస్తున్నాయి. వారు తమ సెల్‌ఫోన్లను స్విఛాఫ్ చేసినట్లు సిట్ గుర్తించింది. వారి అరెస్టు అనివార్యమనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ సమయంలోనైనా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ కేసు మరింత తీవ్ర రూపం దాల్చనుంది.