ప్రధానమంత్రి మోదీ తన ముఖం తాను అద్దంలో చూసుకున్నా ఎన్నికలే కనిపిస్తాయేమో! లేకపోతే ఇటీవల బెంగాల్లో జరిగిన సంథాల్ తెగవారి తొమ్మిదవ అంతర్జాతీయ మహాసభకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి మమత స్వాగతం చెప్పకపోవడం వివాదానికి దారి తీసేదే కాదు. నిజానికి ఈ మహాసభ ప్రభుత్వ అధ్వర్యంలో జరిగింది కాదు. అదొక ప్రైవేటు వ్యవహారం. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతిని విమానాశ్రయంలో ఆహ్వానించలేదని, ఇది అధికార మర్యాదలను ఉల్లంఘించడమేనని రచ్చ జరుగుతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఏ రాష్ట్రానికి వెళ్లినా పాటించ వలసిన అధికార మర్యాదలు ఏమిటో స్పష్టంగా ఉంటాయి. ఇందులో ఏమైనా మార్పులు ఉంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జిల్లా స్థాయి పోలీసు అధికారుల దాకా ఆ మార్పుల గురించి తెలియజేస్తుంది. అధికార మర్యాదలకు సంబంధించి ఉండే ఈ వివరాలు అన్నీ నిర్దిష్టంగానే ఉంటాయి. దాన్ని “బ్లూ బుక” అంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఏ రాష్ట్రానికైనా వెళ్తే వారికి స్వాగత సత్కారాలు ఎలా చేయాలో, పాటించవలసిన అధికార మర్యాదలు ఏమిటో ఆ “బ్లూ బుక” లో ఉంటాయి. దీని ప్రకారం ముఖ్యమంత్రే స్వయంగా వెళ్లి స్వాగతం చెప్పి తీరాలన్న నిబంధన ఎక్కడా లేదు. నిజానికి అలాంటి సందర్భాలలో గవర్నర్ కూడా స్వాగతం చెప్పడం ఆనవాయితీ. ఒక వేళ ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పడానికి ఏ కారణం చేతనైనా వీలు లేకపోతే ఒక మంత్రికి ఆ బాధ్యత అప్పగిస్తారు. మమతా బెనర్జీ రాష్ట్రపతికి స్వాగతం చెప్పడానికి ఓ మంత్రినైనా నియమించకపోవడం అనౌచిత్యం కావొచ్చు. కానీ ముఖ్యమంత్రి స్వాగతం చెప్పకపోవడం మర్యాద పాటించకపోవడం అని వాదించడం పచ్చి రాజకీయం. బెంగాల్లో వచ్చే ఏప్రిల్, మేలోగా శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలనేవే లేకపోతే ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికార మర్యాద ఉల్లంఘించారని మమతా బెనర్జీ మీద విరుచుకుపడే వారే కాదు. రాష్ట్రపతి ముర్ము స్వయంగా బెంగాల్ ముఖ్యమంత్రిని అన్యాపదేశంగా తప్పు పట్టడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం. తనకు స్వాగతం చెప్పడానికి మమతాబెనర్జీ గానీ, బెంగాల్ మంత్రిగానీ రాకపోవడాన్ని నేరుగా ప్రస్తావించకుండా ముర్ము తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంథాల్ తెగ వారి సమావేశం జరగవలసిన చోటును మార్చినందుకు ముర్ము తన “ఎక్స” (ఇదివరకు ట్విట్టర్) ఖాతాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమావేశానికి ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ హాజరు కాకపోవడం రాష్ట్రపతి అసంతృప్తిని ఇనుమడింప చేసింది. సంథాల్ మహాసభ వేదిక మార్చడం ఆ మహాసభ నిర్వాహకులకు పరిమితమైన అంశం. అందులో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఏమీ ఉండదు. రాష్ట్రపతి ఎక్కడికి వెళ్లినా అధికార మర్యాదలు పాటించాల్సిందే. అయితే ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించాలన్న నియమం లేదు. అది ఆనవాయితీ మాత్రమే. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతికి, ప్రధానికి వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు స్వాగతం చెప్పని సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మొన్నటి ముర్ము పర్యటన సందర్భాన్ని మినహాయిస్తే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వచ్చినప్పుడు స్వయంగా స్వాగతం చెప్పకుండా ఉన్న సందర్భమే లేదు. ఉదాహరణకు 2021 మేలో ప్రధానమంత్రి మోదీ బెంగాల్ వెళ్లినప్పుడు మమతా బెనర్జీ స్వయంగా ఆయనకు స్వాగతం చెప్పారు. కాని తుపానుపై ప్రధాని ఏర్పాటుచేసిన సమావేశానికి ఆమె హాజరుకాలేదు. అది రాజకీయాలకు సంబంధించిన అంశం. గత ఏడాది సెప్టెంబర్ 25న రాష్ట్రపతి ముర్ము మథుర వెళ్తే గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గానీ, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గానీ ఆమెకు స్వాగతం చెప్పలేదు. అయితే లక్ష్మీ నారాయణ్ చౌదరిని మాత్రం రాష్ట్రపతికి స్వాగతం చెప్పడానికి నియోగించారు. మోదీ ప్రధానమంత్రి అయిన తరవాత కూడా అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వాగతం చెప్పడానికి ఆయన అన్ని సందర్భాలలోనూ ఓ మంత్రినే పంపించారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సైతం అఖిలేశ్ యాదవ్ స్వాగతం చెప్పిన దాఖలాలు లేవు. ఎవరు స్వాగతం చెప్తారు, ఎవరెవరు తమను కలుసుకుంటారు అన్న వివరాలు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ముందే తెలియజేస్తారు. వారి కార్యాలయాలకు ఈ వివరాలన్నీ తెలియజేస్తారు. మమత సర్కారు కూడా ఆ పని చేసే ఉంటారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి బెంగాల్ ముఖ్యమంత్రి స్వాగతం చెప్పనందుకు ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అయితే బెంగాల్ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. బెంగాల్ ప్రభుత్వం ఆ వివరణ పంపించినట్టు ఉంది. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైందని ప్రధాని మోదీ నీతులు చెప్తున్నారు. అనేకసార్లు తానే ఎన్నికల లబ్ధి కోసం రాష్ట్రపతి ముర్ము పేరును ఎలా దుర్వినియోగం చేశారో మోదీ మరిచిపోయారేమో! 2024లో రాజస్థాన్లోని బన్స్వారాలో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక గిరిజన వ్యక్తిని రాష్ట్రపతిని చేయలేక పోయిందని ఆరోపించారు. అంటే తాము మాత్రమే గిరిజన మహిళ అయిన ముర్మును రాష్ట్రపతిని చేశామని చెప్పి రాష్ట్రపతి హోదాలో ఉన్న వారి పేరును మోదీ ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి వినియోగించుకున్నారు. అనేక ఎన్నికల ప్రచార సభల్లో మోదీ, అమిత్ షా చాలాసార్లు రాష్ట్రపతి ముర్ము పేరును యథేచ్ఛగా ఉపయోగించుకున్నారు. 2022లో గుజరాత్ ఎన్నికల ప్రచార సందర్భంలోనూ కాంగ్రెస్ గిరిజనుల్ని దోపిడీ చేస్తే తాము ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశామని గొప్పలు చెప్ప్పుకున్నారు. రాష్ట్రపతి ముర్ము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ కుర్చీలో కూర్చున్నారు. రాజ్యాంగ పరిరక్షణలో ఆమెదే కీలక పాత్ర. కానీ స్వయంగా వచ్చి స్వాగతం చెప్పనందుకు మమతా బెనర్జీని తప్పు పట్టడం మరిచిపోని ముర్ము ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఎన్నికల్లో ప్రయోజనం సాధించడం కోసం తన పేరును విచ్చలవిడిగా వాడుకుంటూ ఉంటే మాత్రం మిన్నకుండిపోతున్నారు. అధికార పక్షం మద్దతు లేకపోతే ఎవరూ రాష్ట్రపతి కాలేరు. అంతమాత్రం చేత అధికార పార్టీ రాష్ట్రపతి పేరును ఎన్నికల్లో విజయం కోసం వినియోగించుకోవడాన్ని సహించడం, చూసీ చూడనట్టు పోవడం అత్యున్నత స్థానంలో ఉన్న ముర్ము లాంటి వారికి భావ్యం కాదు. రాష్ట్రపతి పదవిలో ఉన్న ఆమె ద్వంద్వ ప్రమాణాలు పాటించడం కచ్చితంగా అనౌచిత్యమే. ఆ పదవిలో ఎవరున్నా రాజ్యాంగ పరిరక్షణ మీదే దృష్టి నిలపాలి తప్ప పక్షపాత ధోరణి చూపకూడదు. రాష్ట్రపతి స్థానంలో ఉన్న వారు అధికారపక్ష అధినేతల ఆగడాలను విస్మరించకూడదు.


