‘ఆడబిడ్డ నిధి’ పథకం అమలు ఎప్ప్పుడు?
. ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ
. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలు
. మండలిలో గందరగోళం
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: శాసనమండలిలో ఆడబిడ్డ నిధి పథకం అమలుపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. పరస్పర ఆరోపణలకు దిగడంతో మండలి వేడెక్కింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలి బుధవారం చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సందర్భంగా 202425, 2025`26 ఆర్థిక సంవత్సరంలో ఆడబిడ్డ నిధి పథకం కింద జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు, దాని కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు తెలపాలని వైసీపీ సభ్యులు వరుదు కల్యాణి, పెనుమత్స వరహ వెంకట సూర్యనారాయణ, ఎస్.మంగమ్మ ప్రశ్నించారు. ఈ సందర్భంగా వరుదు కల్యాణి మాట్లాడుతూ సూపర్ 6 కింద ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అని, 18 ఏళ్లునిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని ఇంటింటికి తిరిగి కూటమి నేతలు ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారని గుర్తుచేశారు. జూన్ 2024 నుంచే పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చారని వరుదు కల్యాణి గుర్తుచేశారు. మూడు బడ్జెట్లు పెట్టినప్పటికీ ఆడబిడ్డ నిథి పథకం ఊసే లేదని, ఒక్కో మహిళకు రూ.32వేలకుపైగా బకాయిలు ఉండిపోయాయని తెలిపారు. దీంతో సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా సమాధా నం ఇవ్వాలని చైర్మన్ మంత్రిని కోరారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ సభ్యులు అడిగిన ఆడబిడ్డ నిధి పథకం వదిలేసి… మిగిలిన అన్ని అంశాలపై మాట్లాడటంతో ఇరు పక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి సమాధానంపై వైసీపీ ఎమ్మెల్సీలు సంతప్తి చెందలేదు. అసలు ఈ పథకంపై సీఎం చంద్రబాబుగానీ, సెర్ప్ శాఖా మంత్రి కొండపల్లిగానీ సమీక్షించారా? అంటూ మళ్లీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. దీనిపై మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్థసారథి, కూటమి ఎమ్మెల్సీలు…వైసీపీ సభ్యులపై ప్రతి వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల పెన్షన్లను పెంచినట్లు వివరించారు. వృద్ధాప్య పింఛన్లను 3 వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచామని, ఏడాదికి రూ.33 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టంచేశారు. మంత్రి సమాధానం ఇస్తున్న సమయంలో సభలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే మంత్రి పార్థసారథి మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో అనేక స్కీమ్‌లలో జరిగిన లోపాలను మంత్రి శ్రీనివాస్ చెబుతున్నారని తెలిపారు. చివరకు.. అధికార, విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ఆ ప్రశ్నకు సమాధానం వచ్చినట్లుగా చైర్మన్ ప్రకటించారు. ప్రశ్నోత్తరాల అనంతరం స్పెషల్ మెన్షన్లను చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ప్రారంభించగా…సభ్యులు సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ప్రభుత్వ బిల్లులను ఆమోదించారు. మండలిని గురువారానికి వాయిదా వేశారు.


