Homeమార్చికల్లా 5.52 లక్షల ఇళ్లు

మార్చికల్లా 5.52 లక్షల ఇళ్లు

- Advertisement -
  • అందరికీ ఇళ్లు లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ
  • కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ టౌన్ షిప్ల నిర్మాణం
  • గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘హౌసింగ్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని సంతృప్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. గృహ నిర్మాణ శాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, పీఎం జన్ మన్ సహా వివిధ పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే నెలలోగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.1.5 లక్షల ఇళ్లను పట్టణ ప్రాంతాల్లోనూ నిర్మాణం చేయాలని సీఎం సూచించారు. డిసెంబరు 2026 నాటికల్లా 2.05 లక్షల ఇళ్లు, 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పీఎంఏవై 1.0, పీఎంఏవై 2.0, పీఎం జన్ మన్ పథకాల కింద రాష్ట్రంలో 18.72 లక్షల ఇళ్లు మంజూరు కాగా… ఇప్పటి వరకూ 13.20 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 16.11 లక్షల ఇళ్లకుగాను ఇప్పటికే 11.31 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందన్నారు. ఏపీ టిడ్కో పరిధిలో 2.61 లక్షల ఇళ్లకుగాను 1.88 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని సీఎంకు వివరించారు. 2027 డిసెంబరు నాటికి 75 వేల కొత్త గృహాలు మంజూరయ్యేలా చూడటంతో పాటు 1.5 లక్షల ఇళ్లను పైప్‌లైన్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన కేటాయింపులు పొందాలని సీఎం స్పష్టం చేశారు.
ఉచిత ఇళ్ల స్థలాలపై ప్రత్యేక కార్యాచరణ
ఇంటి స్థలాలు లేని కుటుంబాల వాస్తవ డిమాండ్‌ను గుర్తించేందుకు ఆర్‌టీజీఎస్ సహా ఆవాస్ ప్లస్, హౌసింగ్, రెవెన్యూ శాఖల నుంచి డేటాను అనుసంధానం చేసుకుని డూప్లికేషన్ లేకుండా అర్హులను గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రాథమిక లబ్ధిదారుల జాబితాలు ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించి పారదర్శకంగా పరిష్కరించిన అనంతరం తుది జాబితాలు ఖరారు చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న లే అవుట్లలో నిర్మాణాలు చేపట్టని భూమిని అవసరానికి అనుగుణంగా 2 లేదా 3 సెంట్ల ప్లాట్లుగా పునర్వ్యవస్థీకరించాలని, ఖాళీ స్థలాల గుర్తింపు, అర్హులైన లబ్ధిదారులకు మ్యాపింగ్, నిర్మాణం పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కుప్పం నియోజకవర్గంలోనూ సాచురేషన్ విధానంలో గృహ నిర్మాణం చేపట్టాలని, 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, శాఖల మధ్య సమన్వయంతో అందరికీ ఇళ్లు లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
పారిశ్రామిక టౌన్ షిప్ల నిర్మాణం
కేంద్ర సహకారంతో వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక టౌన్ షిప్లు నిర్మించే అంశంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని శ్రీసిటీ సహా వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్ షిప్ల ఏర్పాటు ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని, ఇందుకోసం ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని టౌన్ షిప్ల నిర్మాణం చేపట్టాలని సీఎం చెప్పారు. సమీక్షలో గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి, హౌసింగ్ శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు