Wednesday, March 12, 2025
Homeమూడేళ్లలో అమరావతి పూర్తి

మూడేళ్లలో అమరావతి పూర్తి

. రూ.37,702 కోట్ల పనులకు ఆమోదం
. నెలాఖరుకు ఐకానిక్‌ బ్రిడ్జి, కరకట్ట రోడ్డు విస్తరణకు టెండర్లు
. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 1300 ఎకరాలు
. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. దాదాపు 59 టెండర్లకు సంబంధించి రూ.రూ.37,702 కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో సీఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం మంగళవారం జరిగింది. కాంట్రాక్టు ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సీఆర్‌డీఏ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిని చెడగొట్టేందుకు ఐదేళ్లపాటు జగన్‌ చేయని ప్రయత్నం లేదు. గత ప్రభుత్వం రాజధానిలో పనులు నిలిపివేసి… 2014-19లో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్లను నిలిపివేయడంతో గుత్తేదారులు తీవ్రంగా నష్టపోయారు. అనేక ఆటంకాలు దాటుకుని మళ్లీ పనులు మొదలవుతున్నాయి. తమ ప్రభుత్వం రాగానే సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి వాటిపై చర్చించామని మంత్రి నారాయణ చెప్పారు. ఎన్టీఆర్‌ విగ్రహం, ఐకానిక్‌ బ్రిడ్జి, కరకట్ట రోడ్డు వంటి 19 పనులు పెండిరగ్‌లో ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ.16,871 కోట్లు. వీటికి సంబంధించి అంచనాలు తయారు చేశారు. మార్చి నెలాఖరులోపు ఈ పనులన్నింటికీ టెండర్లు పిలుస్తామని తెలిపారు. మొత్తం 31 సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి ప్రక్రియ పూర్తయిందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సేకరించిన భూమిలో రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రాజెక్టులకుపోను 6,203 ఎకరాలు సీఆర్‌డీఏకు మిగిలింది. అందులో దాదాపు 1300 ఎకరాలు వివిధ సంస్థలకు ఇవ్వబోతున్నాం. దాదాపు నాలుగు వేల ఎకరాలు అభివృద్ధి చేసిన భూమిని వేలం ద్వారా విక్రయించి… రాజధాని నిర్మాణానికి నిధులు సమకూరుస్తాం. పక్కా ప్రణాళికతోనే అమరావతి నగరం అభివృద్ధి జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
రూ.64,721 కోట్లు ఖర్చు
అమరావతి నిర్మాణానికి మొత్తం రూ.64,721 కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌(ఏజీసీ)లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎల్పీఎస్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.64,721.48 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి రూ.13,400 కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ.5 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, కేంద్రం గ్రాంట్‌ కింద మరో రూ.1560 కోట్లు తీసుకుంటున్నామని తెలిపారు. అమరావతిలో 106 ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. అమరావతిలో ట్రంక్‌ రోడ్లు(మెయిన్‌ రోడ్లు) 165 అడుగులు,185 అడుగులతో రెండేళ్లలో పూర్తి చేస్తామని, ఎల్పీఎస్‌ రోడ్లు మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు ఏడాదిన్నరలో, మిగతావి రెండేళ్లు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. గత ప్రభుత్వం కక్ష సాధింపుతో ఆర్‌-5 జోన్‌ చేసి 50 వేల మందికి సెంటు చొప్పున భూమి ఇచ్చిందని, వారికి కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామన్నారు. వేరొక చోట స్థలం కేటాయించి అమరావతి భూములను రాజధాని కోసం తీసుకుంటామని మంత్రి వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు