Wednesday, April 23, 2025
Homeమెరుపు దాడి తప్పదా?

మెరుపు దాడి తప్పదా?

ప్రతీకారానికి భారత్‌ సై…
ఉన్నతస్థాయి భద్రతా సమీక్షలు

పాక్‌ అప్రమత్తం…
సరిహద్దులకు యుద్ధ విమానాలు

న్యూదిల్లీ : జమ్మూకశ్మీర్‌, పహల్గాంలో ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు 26 మందిని కిరాతకంగా చంపేయడంతో భారతావని ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇప్పటికే దాడికి సంబంధించిన కార్యాచరణ మొత్తం దాయాది దేశం పాకిస్థాన్‌లో జరిగినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. కరాచీ, పీఓకేలోని ముజఫరాబాద్‌తో దాడికి సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఉగ్రవాదుల కోసం ఘటన జరిగిన సమీప ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గాలింపు జరుపుతున్నాయి. మరో పక్క ప్రపంచదేశాలు ఉగ్ర ఘాతుకాన్ని ఖండిస్తూ…భారత్‌కు సంఫీుభావం తెలిపాయి. మరో పక్క కశ్మీర్‌ సహా దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల చర్యలను నిరసిస్తూ… బాధితులకు నివాళులర్పిస్తూ ప్రదర్శనలు జరిగాయి. రాజకీయాలకు అతీతంగా యావత్‌ రాజకీయ పక్షాలు ఉగ్రదాడిని ఖండిరచాయి. కష్టకాలంలో ఐక్యంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చాయి. కేంద్రప్రభుత్వానికి అండగా ఉంటామని భరోసానిచ్చాయి.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ సౌదీ నుంచి తిరిగి వచ్చారు. వచ్చే మార్గంలో పాక్‌ గగనతలాన్ని నివారించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ త్రివిదళాధిపతులతో భేటీ అయ్యి పరిస్థితిని సమీక్షించారు. ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహరాల కేబినెట్‌ కమిటీ కూడా అత్యవసరంగా సమావేశమైంది. పహల్గాం ఘటన నేపథ్య పరిణామాలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని దృష్టి కేంద్రీకరించారు.
అటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా జమ్మూకశ్మీర్‌ చేరుకొని బాధితులను పరామర్శించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీశారు. ఉగ్రవాదాన్ని అణచివేస్తామన్నారు. ఇదిలావుంటే, ఈ దాడికి దీటుగా బదులిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. తాజా పరిణామాలతో పాకిస్థాన్‌ బెంబేలెత్తింది. ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ భారత సరిహద్దుల వద్ద భారీగా పాక్‌ పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది. ఇప్పటికే పాక్‌ ఆర్మీ సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించినట్లు సమాచారం. పాక్‌ వైమానిక దళం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 2016లో పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద లాంచ్‌ ప్యాడ్‌లపై మరియు 2019లో బాలాకోట్‌ ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం సర్జికల్‌ దాడులు చేసింది. దీంతో, ఈ దాడికి కూడా భారత్‌ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని పాక్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌ తన యుద్ధవిమానాలను సిద్ధం చేసింది. కరాచీలోని దక్షిణ ఎయిర్‌ కమాండ్‌ నుంచి ఉత్తరం వైపు లాహోర్‌, రావల్పిండి సమీప స్థావరాలకు లాక్‌హీడ్‌ సీ-130 హెర్క్యూలస్‌, ఎంబ్రారర్‌ ఫోనమ్‌ 100 జెట్‌ విమానం వంటి యుద్ధ విమానాలను పాకిస్థాన్‌ పంపినట్లు తెలుస్తోంది.
దిల్లీ అలర్ట్‌
పహల్గాం ఘటన దృష్టా దేశ రాజధాని దిల్లీ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ సహా సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులు, పారా మిలటరీని మోహరించారు.
జమ్మూకశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సభ్యులు సహా 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా సంస్థలు వెల్లడిరచాయి. ఈ 56 మందిలో 18 మంది జైషే మహమ్మద్‌కు చెందిన వారు కాగా 35 మంది ఎల్‌ఈటీ సభ్యులని భద్రతా సంస్థల రికార్డుల ద్వారా తెలుస్తోంది. వీరిలో ముగ్గురికి హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌తో సంబంధం ఉందని, వారు పాకిస్థాన్‌కు చెందినవారని భద్రతాధికారి ఒకరు తెలిపారు. మరో 17 మంది స్థానికులు ఉన్నట్లు సమాచారం. కశ్మీర్‌కు పర్యాటకులు పెరిగిన నేపథ్యంలో ఉగ్ర వాదులు రెచ్చిపోయినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఎల్‌ఈటీ అనుబంధ ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు అక్కడి పర్యాటకులపై దాడి చేశారు. ఆపై అడవుల్లోకి పారిపోయారు. వీరి కోసం గాలింపులు కొనసాగుతున్నాయి.
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు పరిహారం
పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడిరచింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు