. చేతనైతే ఆర్థిక వ్యవస్థలో చైనాతో పోటీ పడండి
. ప్రధానికి చంద్రబాబు, పవన్ భజన
. 2న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు : భారత దేశం ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఎదిగిందని, జపాన్‌ను మించిపోయిందని, ఇదంతా ప్రధాని నరేంద్రమోదీ పాలనాదక్షతకు నిదర్శనమి గొప్పలు చెప్పుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. జపాన్ జీడీపీ కన్నా భారత్ జీడీపీ అధికంగా ఉందని ప్రచారం చేసుకుంటున్నారని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాకా ఊదుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారన్నారు. భారతదేశం జపాన్‌తో కాకుండా రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా కొనసాగుతున్న చైనాతో పోటీ పడాలని రామకృష్ణ సవాల్ విసిరారు. స్థానిక సీఆర్ భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్యతో కలిసి రామకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జపాన్ జనాభా 12.30 కోట్లని, భారతదేశ జనాభా 146 కోట్లని, జపాన్ జీడీపీ 4.186 ట్రిలియన్ డాలర్లు కాగా భారతదేశ జీడీపీ 4.187 ట్రిలియన్ డాలర్లుగా ఉందని రామకృష్ణ గుర్తుచేశారు. జనాభా పరంగా చూస్తే…భారత్ జీడీపీ, జపాన్ జీడీపీలో పెద్ద వ్యత్యాసమేమీ లేదని వివరించారు. భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది. చైనాకు 1948లో స్వాతంత్య్రం వచ్చింది. 1987 వరకు రెండు దేశాలు సమానంగా ఉన్నా… నేడు చైనా ప్రపంచంలోనే అమెరికా తరువాత 19.23 ట్రిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉందని తెలిపారు. మోదీ ప్రభుత్వం… చైనాతో పోటీ పడకుండా జపాన్‌తో పోటీ పడటం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు కూడా మోదీ భజన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. భారత్ ఏ విషయంలో అభివృద్ది సాధించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినపుడు భారత దేశం అప్పు రూ.84 లక్షల కోట్లు కాగా ప్రస్తుతం రూ.224 లక్షల కోట్లుకు పెరిగిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది. విదేశాల్లో ఉన్న నల్లడబ్బులు వెనక్కి తీసుకురాలేదు. పాకిస్థాన్‌తో ఎందుకు యుద్దం విరమించారో దేశ ప్రజలకు చెప్పడం లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితే యుద్ధం విరమి స్తారా అని ప్రశ్నించారు. దేశ పరువు, ప్రతిష్టలను మోదీ ప్రభుత్వం దిగజార్చిందని మండిపడ్డారు. గతంలో పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, మన్‌మోహన్‌సింగ్ అమెరికా మద్యవర్తిత్వాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు తన వైఖరి మార్చుకోవా లని, ఈ విషయంపై చర్చకు రావాలన్నారు. జమిలీ ఎన్నికలపై డీఎంకేతో మాట్లాడతానని పవన్‌కల్యాణ్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా నేటికీ సూపర్ సిక్స్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో రెండుసెంట్ల స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, రైతులకు కేంద్రంతో కలిపి ఇస్తామన్న రూ.20 వేలు వారి ఖాతాలో జమచేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.జగన్నాధం, జి.చంద్రశేఖర్, నగర సహాయ కార్యదర్శి డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విఫల ప్రధాని మోదీ
దేశంలో రూపాయి విలువ తగ్గించి, పేదరికం, నిరుద్యోగం పెంచిన నరేంద్రమోదీ విఫల ప్రధానిగా నిలిచారని కె.రామకృష్ణ ఓ ప్రకటనలో విమర్శించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచదేశాలలో 4వ స్థానానికి చేరిందని, అందుకు ప్రధాని మోదీ విధానాలే కారణమని రెండు, మూడు రోజులుగా ఎన్‌డీఏ నేతలు ఊదరగొడుతున్నారని, ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందువరుసలో ఉన్నారని తెలిపారు. సీనియర్ రాజకీయ, ఆర్థికవేత్తగా, అన్ని విషయాలు అవగాహన కలిగిన చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించడంలో అగ్రభాగాన ఉన్నారన్నారు. మోదీ ఏదో సాధించేసినట్లు, భారత్ ఎంతో ముందుకెళ్లిపోయినట్లుగా ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలా ఉందే తప్ప మరొకటి కాదన్నారు. మోదీ ప్రధాని అయ్యేనాటికి డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.61 ఉండగా… నేడు రూ.85కు పైగా చేరిందని వివరించారు. పదేళ్ల క్రితం భారత్‌లో 97 మంది బిలియనీర్లు ఉండగా… నేడు 210కి చేరినట్లు తెలిపారు.