సీనియర్లు, జూనియర్లకు తగిన గౌరవం
పార్టీ కోసం కష్టపడేవారికి ప్రోత్సాహం
ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్‌సిక్స్ అమలు
మహానాడులో ఆరు శాసనాలు ప్రవేశపెట్టిన నారా లోకేశ్
విశాలాంధ్ర బ్యూరో – కడప : కాలం మారుతోంది… ప్రజల అవసరాలు మారుతున్నాయి… వారి ఆలోచన విధానం కూడా మారుతోంది… పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా కీలక విధానపర మార్పులు తీసుకురావాలి… ఇందుకోసం ఆరు శాసనాలను తాను ప్రతిపాదిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. కడప మహానాడు వేదికపై తొలిరోజు మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రతినిధుల నుద్దేశించి లోకేశ్ ప్రసంగించారు. ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వచ్చింది. ఇందుకోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నట్లు లోకేశ్ ప్రతినిధులకు వివరించారు.
తెలుగుజాతి…విశ్వఖ్యాతి
తెలుగుదేశం వల్లే భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాల్లో తెలుగువారికి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు ప్రపంచంలో నెం. 1 స్థానంలో ఉండాలి. అన్నిరంగాల్లో మన తెలుగువారే ముందుండాలి. దీనినే అజెండాగా పెట్టుకొని మనం పనిచేయాలి.
యువగళం
తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేయబోతున్నాం. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తాం, పనిచేసేవారిని ప్రోత్సహిస్తాం. రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు ఇస్తే దూసుకుపోతారు. అన్నిరంగాల్లో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే మన లక్ష్యం.
స్త్రీశక్తి
అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చింది మన చంద్రన్న. పార్టీ పదవుల దగ్గర్నుంచి అన్నిరంగాల్లో మహిళలకు సమాన బాధ్యత, భద్రత కల్పించాలి. మార్పు మన ఇంటినుంచే మొదలు కావాలి. ఇప్పుడు కూడా కొన్ని పదాలు వాడుతున్నారు. గాజులు తొడ్డుకున్నావా, చీరకట్టుకున్నావా, ఆడపిల్లలా ఏడవొద్దు లాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది అని లోకేశ్ చెప్పారు.
పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్
పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అందుకే ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్` 6 హామీని అమలుచేసే దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కుటుంబాలకు సామాజిక సమన్యాయం అందుకే ప్రతివారికి న్యాయం చేసేలా సోషల్ రీఇంజనీరింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
అన్నదాతకు అండగా…
రైతు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన పార్టీ తెలుగుదేశం. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర్నుంచి మన సీబీఎన్ వరకు రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషిచేశాం. డ్రిప్ ఇరిగేషన్ దగ్గరనుంచి నీటిపారుదల ప్రాజెక్టులు, సబ్సిడీలు ఇవ్వడమేగాక ఉద్యాన పంటలను ప్రోత్సహించింది తెలుగుదేశం. ఈరోజు మనం ఆక్వా, పామాయిల్, కోకోలో నెం.1, మామిడి, జీడిపంటల్లో నెం.2 స్థానాల్లో ఉన్నాం. బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. చేయూతనందిస్తే మన రైతులు బంగారం పండిస్తారు. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని అమలుచేయాలి.
కార్యకర్తలే అధినేత
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. కార్యకర్తలు చెమట వల్లే ఈనాడు మేం ఇక్కడ కూర్చున్నాం. ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్పూర్తి. తోట చంద్ర య్య గురించి ఎంత చెప్పినా తక్కువ. నడివీధిలో కత్తి గొంతుపై పెట్టి ఒక్కసారి వారి నాయకుడికి జై చెప్పమంటే… జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడు చంద్రయ్య. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలే మన బలం, బలగం. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా కోటిమంది కుటుంబసభ్యులు మనకి ఉన్నారు. అందుకే అలాంటి కార్యకర్తలను ఆదుకోవడానికి, వారు సొంత కాళ్లపై నిలబడేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నా తెలుగు కుటుంబం సాక్షిగా ఈ మహానాడు వేదికపై ఆరుశాసనాలను ప్రతిపాదిస్తున్నాను, ఈ ఆరు శాసనాలను బలపర్చాల్సిందిగా లోకేశ్ కోరారు.