- స్వర’గిరిగా… ఇక జొన్నగిరి
- జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ మైన్స్ రూ.405 కోట్ల పెట్టుబడి
- ఏడాదికి 2 టన్నుల వరకు బంగారం వెలికితీత
- ఉత్పత్తి విలువలో రాష్ట్ర ఖజానాకు
4 శాతం రాయల్టీ - తవ్వకాలకు 1,500 ఎకరాలు కేటాయింపు
- నేడు ప్రాజెక్టు ప్రారంభించనున్న
సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : బంగారు నిక్షేపాల గని అంటే కర్నాటక రాష్ట్రంలోని కేజీఎఫ్ గుర్తొచ్చేది… కానీ ఇప్పుడు ఆ స్థానంలో జొన్నగిరి పేరు మారుమోగనుంది. కరవు కేకలు వినిపించిన ఒకప్పటి కర్నూలు జిల్లా ఇక బంగారం ఉత్పత్తికి ప్రధాన వేదిక కానుంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఏర్పాటయింది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌కు ప్రభుత్వం 1,500 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు జరగనున్నాయి. దీనికి తగినట్టుగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. రెండో దశలో మిగిలిన ప్రాంతంలోనూ ప్లాంట్‌ను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఏర్పాటయిన ఈ ప్లాంట్ ద్వారా తొలి ఏడాదికి 400 కిలోల పసిడిని ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి 900 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తారు. ఈ రకంగా ఏటేటా ఉత్పత్తి పెరుగుతూ… సంవత్సరానికి 2 టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు ప్లాంట్ సామర్థ్యాన్ని విస్తరించనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 700 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక ఉత్పత్తి చేసిన బంగారం ధరలో 4 శాతం రాష్ట్రానికి రాయల్టీగా వస్తుంది. మొదట తీసే 400 కేజీలకు రూ.57 కోట్లు, 900 కేజీలకు రూ.144 కోట్ల వరకు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రానుంది.
రెండో యూనిట్‌కు శంకుస్థాపన
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం, జొన్నగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అనంతరం ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు రూ.405 కోట్ల పెట్టుబడితో బంగారు నిక్షేపాలు వెలికితీసే ఈ కర్మాగారాన్ని నెలకొల్పాయి. ఇందుకు అవసరమైన నీటి కోసం హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 18 కి.మీ. పైపులైన్తో 0.021 టీఎంసీలను వినియోగించనున్నారు. ఈ మేరకు బుధవారం సీఎం చేతుల మీదుగా బంగారం ఉత్పత్తి పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గనిలో ట్రయల్ రన్స్ కూడా పూర్తయ్యాయి.


