Homeరాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా?

రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా?

- Advertisement -

వారంలోగా మీ స్పందన తెలియజేయండి
కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

న్యూదిల్లీ:రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలని కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం… వచ్చే మంగళవారం నాటికి దీనిపై స్పందన తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, మొత్తం దేశానికి సంబంధించిన విషయమని గమనించాలని ఈసందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘‘రాజ్యాంగానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఈ విషయంలో సాయం చేయాలని అటార్నీ జనరల్‌ను కోరుతున్నాం. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశాం. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ హాజరు కావాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించాం. అన్ని స్థాయీ సంఘాలకు కూడా నోటీసులు జారీ చేశాం. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశాం’’ అని సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌? పీఎస్‌ నరసింహం, జస్టిస్‌ ఏఎస్‌ చండూర్కర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. శాసనసభలు ఆమోదించిన బిల్లులపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి ఒక కాల వ్యవధిలోగా చర్యలు తీసుకోవాలని గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు రాజ్యాంగంలోని 143(1) అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొని 14 కీలక ప్రశ్నలను సుప్రీంకోర్టును అడిగారు. ఈ అంశంపై విచారణకు షెడ్యూల్‌ను జులై 29న ఖరారు చేసి ఆగస్టులో విచారణ ప్రారంభించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని కొద్ది రోజుల క్రితం తీర్పు ఇచ్చిన క్రమంలో 415 పేజీల తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్‌ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపించడమో చేయాలని సూచించింది. ఒకవేళ బిల్లులను వెనక్కి తిప్పి పంపితే ఎందుకు ఎలా చేశారనే కారణాలు కూడా చెప్పాలని పేర్కొంది. అంతే కాకుండా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకు చెప్పింది. గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అలాంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు