Saturday, March 29, 2025
Homeరెండేళ్లలో పోలవరం

రెండేళ్లలో పోలవరం

పునరావాసం పూర్తయ్యాకే ప్రాజెక్టు ప్రారంభిస్తాం

. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
. డిసెంబరు 31 కల్లా డయాఫ్రం వాల్‌ నిర్మాణం
. గత పాలకుల అహంభావంతో తీరని నష్టం
. ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – ఏలూరు : 2027 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గురువారం 3వ సారి ఆయన పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను చంద్రబాబు ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. హెలిపాడ్‌ వద్ద పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని…ఆ తరువాతే ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.4,311 కోట్ల పరిహారం అందించగా… 2019లో వైసీపీ వచ్చాక… ఐదేళ్లలో నిర్వాసితుల గురించి ఆలోచించలేదని విమర్శించారు. 2024 లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వాసితుల ఖాతాలలో రూ.829 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 2019లో తాము అధికారంలో వచ్చి ఉంటే 2020కే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేవారమని పేర్కొన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేయడం వలన ఖర్చు భారీగా పెరిగిపోయిందన్నారు. రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్‌ కడితే వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల కొట్టుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరల రూ.990 కోట్లతో కొత్తగా డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. 2026 డిసెంబర్‌ నాటికి పునరావాసం పూర్తి చేస్తామని తెలిపారు. దళారులకు, మోసగాళ్లకు అవకాశం లేకుండా పారదర్శ కంగా పరిహారం చెల్లిస్తున్నామన్నారు. అన్యాయంగా కొందరి పేర్లు తొలగించారని బాధితులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. విచారణ చేయించి… అర్హులందరికీ పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం గిరిజనులు ఎక్కువ త్యాగం చేశారని, ఇల్లు నిర్మించుకునే గిరిజనులకు అదనంగా రూ.75 వేలు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. గురువారం మధ్యాహ్నం 12.10 లకు పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా ప్రాజెక్ట్‌ వ్యూ పాయింట్‌ నుండి పనుల ప్రగతిని పరిశీలించారు. జల వనరుల శాఖామంత్రి డా. నిమ్మల రామానాయుడు, జల వనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ రెడ్డి రామచంద్ర రావు ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించారు. అనంతరం ఎగువ కాపర్‌ డ్యాం,చేరుకుని అక్కడ జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ ను పరిశీలించారు. అనంతరం గ్యాప్‌ -1 డయాఫ్రమ్‌ వాల్‌, వైబ్రో కంప్యాక్షన్‌ చేరుకుని ఇంజనీరింగ్‌ అధికారులనుంచి పనుల వివరాలు తెలుసుకున్నారు.
అధికారులతో సమీక్ష…
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టేందుకు వెనుకాడమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రాజెక్టు పనుల అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో ముఖ్యమంత్రి ప్రాజెక్ట్‌ సమావేశం హాలులో సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాలకు ముందుగానే పనులు పూర్తిచేసి జాతికి అంకితం ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు వారికి కేటాయించిన పనులను నిర్ణిత సమయానికంటే ముందుగానే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని 2025 డిసెంబరు నాటికి, కుడి ప్రధాన కాలువ కనెక్టవిటీలను జులై 2026 నాటికి పూర్తి చేయాలన్నారు. ఈసీఅర్‌ ఎఫ్‌ గ్యాప్‌ 1 పనులను 2026 మార్చి లోగా, గ్యాప్‌ 2 పనులను 2027 డిసెంబరు నాటికి లక్ష్యం నిర్దేశించినప్పటికీ గోదావరి పుష్కరాల కంటే ముందుగానే 2027 ఏప్రిల్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలన్నారు. పాపికొండల నుండి ధవళేశ్వరం వరకు పర్యాటకంగా హోటల్స్‌ ఏర్పాటు చేయడం, పోలవరం ప్రాజెక్టు వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బట్రస్‌ డ్యాం పూర్తికి రూ.82 కోట్లు, ప్రాజెక్టు అత్యవసర పనుల నిమిత్తం రూ.400కోట్లు, భూ సేకరణ, పునరావాస కార్యక్రమాలకు అత్యవసరంగా రూ.486 కోట్లు అవసరం అవుతాయని ఇంజనీరింగ్‌ అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమీక్షలో మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి, జెన్కో ఎండీ చక్రధర బాబు, ప్రాజెక్టు ఇంజనీర్‌ కే నరసింహమూర్తి, మేఘా కంపెనీ డైరెక్టర్‌ సీహెచ్‌ పీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
మాది చేతల ప్రభుత్వం
ప్రాజెక్టు కార్యాలయంలో సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగలమని ధీమాతో ముందుకు వెళుతున్నామన్నారు. పోలవరం పై 82 సార్లు వర్చువల్‌ గా సమీక్షించానని, పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతోందనే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. ఎడమ కాలువ ప్రధాన పనులు కూడా వేగవంతంగా పూర్తి చేశామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పు క్షమించరాని నేరం అన్నారు. రాజకీయ కక్షతో రివర్స్‌ టెండర్‌ పేరుతో ప్రాజెక్టుపై జగన్‌ కక్ష తీర్చుకున్నారని మండిపడ్డారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి రూ 990 కోట్లు ఖర్చు అవుతుందని… డిసెంబర్‌ 31 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు గురువారం పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర మంత్రులు, నాదెండ్ల మనోహర్‌, జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), కామినేని శ్రీనివాస్‌, పితాని సత్యనారాయణ,సొంగా రోషన్‌ కుమార్‌, చింతమనేని ప్రభాకర్‌, ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ, ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ కె. వెట్రి సెల్వి, జాయింట్‌ కలెక్టర్‌ పి.ధాత్రి రెడ్డి, ఎస్పీ కె. ప్రతాప్‌ శివ కిషోర్‌,ట్రై కార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాస్‌ తదితరులు పుష్పపుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు