. ఫుడ్ ప్రాసెసింగ్‌కు మంచి అవకాశాలు
. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు
. ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సులో చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో- విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ను ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఈ రంగాల్లో సాధిస్తామని దీమా వ్యక్తంచేశారు. విశాఖలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(టీపీసీఐ) శుక్రవారం నిర్వహించిన ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సుకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాలను లాభదాయకంగా, సుస్థిరంగా మార్చటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగం విలువ 8 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, భారత్ కూడా 2030 నాటికి 700 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తోందని అన్నారు. ఈ రంగంలో భారత్ మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఏపీ 9 శాతం వాటాతో 50 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉందని చెప్పారు. అలాగే జీఎస్డీపీలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల వాటా 35 శాతంతో రూ.5.19 లక్షల కోట్లుగా ఉందన్నారు. త్వరలోనే ఏపీ ఫ్రూట్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా అవతరిస్తుందని, దేశ ఉత్పత్తిలో 25 శాతం వాటాకు చేరుకుంటామని సీఎం తెలిపారు. 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దేశానికి ఓ దిక్చూచిగా ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. విస్తృతమైన మౌలిక సదుపాయాలు ఏపీ సొంతమని పెట్టుబడిదారులు, ఎగుమతిదారులకు వివరించారు. రాష్ట్రంలో 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్, 33 లక్షల టన్నుల సరకు నిల్వకు గోదాములు ఉన్నాయని వివరించారు. ఫుడ్, బేెవరేజ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తూ… 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడిరచారు. చిత్తూరు, గుంటూరు, కోస్తాంధ్ర, విశాఖ జిల్లాల్లో పండ్లు, మసాలా దినుసులు, ఆక్వా, కోకో, కాఫీ క్లస్టర్లు ఉన్నాయని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు దాటితే… వాటిని మెగా ప్రాజెక్టులుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం వెల్లడిరచారు. గత ఏడాది రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రజల ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలితో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపారమైన అవకాశాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని సీఎం పిలుపునిచ్చారు. ఈ రంగంలో వచ్చే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయని అన్నారు. వన్ ఫ్యామిలి -వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఫుడ్, బేవరేజెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తామని అన్నారు. అగ్రిటెక్ రంగంలో బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. మరోవైపు భారత్‌లో తయారయ్యే ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అందమైన విశాఖ దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా ఖ్యాతి గడిరచిందన్నారు. త్వరలోనే సీ కేబుల్, డేటా సెంటర్లు విశాఖలో ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ సహా వ్యవసాయాధారిత పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అమరావతిలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాప్టర్ ఏర్పాటు కానుండటం సంతోషదాయకమని ముఖ్యమంత్రి అన్నారు. సదస్సుకు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, టీపీసీఐ చైర్మన్ మోహిత్ సింగ్లా, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కేంద్ర కార్యదర్శి అవినాశ్ జోషి, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో జి.శేఖర్ బాబు, ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి.దాసు, జాయింట్ డైరెక్టర్ బాయ్ పాయ్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జీఎం హనుమానాయక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామిక ప్రతినిధులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎగుమతిదారులు, నిపుణులు హాజరయ్యారు.


