దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడి అరంగేట్రం ఐర్లాండ్ సిరీస్‌లోనే జరగవచ్చని అందరూ భావిస్తున్న తరుణంలో ఆ దేశంలో నెలకొన్న సామాజిక అశాంతి, అల్లర్లే ఇందుకు కారణమయ్యాయి. ఈ పరిణామాలతో అసలు సిరీస్ జరుగుతుందా? లేదా? అన్న ఆందోళన మొదలైంది. ఐర్లాండ్‌లో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే లిస్బన్‌లో జరగాల్సిన ఇంటర్-ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన ఐరిష్ సీనియర్ కప్, నేషనల్ కప్ మ్యాచ్‌ల నిర్వహణపై రాబోయే 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ ఐర్లాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఁప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. మా ప్రావిన్షియల్ యూనియన్లు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు, మద్దతుదారుల భద్రతే మాకు అత్యంత ముఖ్యంఁ అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఒకవేళ పరిస్థితులు అదుపులోకి రాకపోతే భారత్-ఐర్లాండ్ సిరీస్‌పై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ పరిణామాలను బీసీసీఐ కూడా నిశితంగా గమనిస్తున్నట్లు ఃదైనిక్ జాగరణ్ః తన కథనంలో పేర్కొంది. ఐర్లాండ్‌లో పరిస్థితులు మెరుగుపడకపోతే, ముందుగా నిర్ణయించిన వేదిక బెల్ఫాస్ట్ నుంచి మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించే అంశాన్ని బీసీసీఐ పరిశీలించవచ్చని ఆ కథనం తెలిపింది.
భిన్నమైన ఆటతీరుతో సూర్యవంశీ
కేవలం 15 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికై సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టిన వైభవ్ సూర్యవంశీ, ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో ఇండియా-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సిక్సర్ల వర్షం కురిపించిన అతను, వన్డే ఫార్మాట్‌లో మాత్రం తన ఆటతీరును మార్చుకున్నాడు. గురువారం ఆఫ్ఘనిస్థాన్-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 44 పరుగులు చేసినప్పటికీ, అందులో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. ఐపీఎల్‌కు భిన్నంగా, ఎంతో పరిణతితో గ్రౌండ్ షాట్లకే ప్రాధాన్యమిచ్చాడు. అయితే, ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ రాణించినా భారత-ఏ జట్టుకు ఓటమి తప్పలేదు.
ఒకవైపు తన అంతర్జాతీయ అరంగేట్రం జరగాల్సిన సిరీస్‌పై అనిశ్చితి నెలకొనగా, మరోవైపు సూర్యవంశీ మాత్రం తన ఆటను మరింత మెరుగుపరుచుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఐర్లాండ్‌లో పరిస్థితులు త్వరగా చక్కబడి, ఈ యువ కెరటం అరంగేట్రం చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.


