పార్థసారథి
మీరు పెరట్లో పాములను పెంచుతూ అవి పక్క ఇంటివాళ్లని మాత్రమే కాటేయాలని ఆశిస్తే అంతకంటే పొరపాటు ఉండదని అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన హిల్లరీ క్లింటన్ ఓ సందర్భంలో పాక్ పైన వ్యాఖ్యానించారు. పాక్‌లో ఇప్పుడు వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తూంటే ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంత సమంజసమైనవో అర్థం అవుతుంది. తీవ్రవాదులను పెంచి పోషించిన పాక్ ఇప్పుడు దాని విషఫలితాలను అనుభవిస్తోంది. ఆర్థిక సంక్షోభానికి తోడు శాంతి భద్రతల సమస్య, పాక్ సైన్యం తుడిచిపెట్టుకుపోవటం వంటివి కలవరపరుస్తున్నాయి. సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని పాక్ భారత్ పైన బురద చల్లుతోంది. ఈ అకృత్యాల వెనక భారత్ హస్తం ఉందని నిందిస్తోంది.
అసలు పాక్‌లో ఏం జరుగుతోందో చూద్దాం. అయిదు రోజుల వ్యవధిలో బెలూచిస్తాన్‌లో రెండు అతి పెద్ద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు సంఘటనలు పాక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఐఎస్‌ఐని అపహాస్యం చేసేలా ఉన్నాయి. పాక్ మిలటరీ ఈ ప్రాంతంలో పట్టు కోల్పోతున్నదని అర్థం అవుతోంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాసింజర్ రైలును హైజాక్ చేసి 36 గంటలపాటు ప్రయాణికులను బందీలుగా చేసి పాకిస్థాన్‌ను గడగడలాడిరచింది. ఈ సంఘటనలో 31 మంది పాక్ సైన్యం మరణించారు. ఇదే సంస్థ అయిదు రోజుల తర్వాత మరో విధ్వంసకర సంఘటనకు పాల్పడిరది. కనీసం 7 బస్సులు, రెండు కార్లతో వెళుతున్న పారామిలటరీ కాన్వాయ్ పైన ఆత్మాహుతి దాడి చేసింది. ఇందులో పాక్ సైన్యం మొత్తం 90 మంది మరణించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని బీఎల్యే విడుదల చేసింది. కాన్వాయ్ పైకి ముందుగా ఆత్మాహుతి బాంబర్ ప్రవేశించటంలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఆ తర్వాత బస్సు నుంచి మంటలు చెలరేగాయి. ఆ తర్వాత తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బెలూచిస్తాన్ లోని నోషికి జాతీయ రహదారిపైన ఈ సంఘటన గగుర్పాటు కలిగించేలా ఉంది.
ఈ రెండూ కాకుండానే పాకిస్తాన్‌లో ఈ నెల 15 వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో లష్కరే తొయిబా మాస్టర్ మైండ్ అబుఖతల్ లేదా ఖతల్ సింధీ హతుడయ్యాడు. లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కి ప్రధాన అనుచరుడు. జమ్మూకశ్మీర్‌లో అనేక విధ్వంసాలకు సూత్రధారి. భారత్ వాంటెడ్ లిస్టులో ఉన్న తీవ్రవాది. సయూద్, ఖతల్ కి ఏదో మీటింగుకు వెళ్లి తిరిగివస్తూండగా వారిపైన దాడిజరిగింది. ఈ దాడిలో సయూద్ తృటిలో తప్పించుకోగలిగాడు. పాకిస్తాన్ ఆర్మీ, ఎల్టీ సేనల రక్షణలోనే ఈ ఇద్దరు నేతలు బయట తిరుగుతారు. ఇలా వరసగా సాగుతున్న సంఘటనలతో పాక్ అతలాకుతలం అవుతోంది. రైలు హైజాక్ సంఘటనలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెనక తాలిబాన్లు చోదకశక్తిగా పనిశారని… దీని వెనక మాస్టర్ మైండ్ భారత్ అని, తమ దేశాన్ని అస్థిరపరచటానికి నిరంతరం పనిచేస్తోందని పాక్ అవాకులు చెవాకులు పేలింది. ఈ ఆరోపణలను భారత్ విదేశాంగ శాఖ ఖండిరచింది. పక్క దేశాలను నిందించటం మానేసి ముందు మీ అంతర్గత సమస్యలను చక్కదిద్దుకోమని సలహా ఇచ్చింది. మరో వైపు భారత ప్రధాని మోదీ కూడా దీనిపైన మాట్లాడారు. ఎమ్‌ఐటీకి చెందిన రీసెర్చి సైంటిస్టు లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో నిర్వహించిన పాడ్ కాస్ట్‌లో పాక్‌తో స్నేహసంబంధాలను పెంచుకోవటానికి తాము ఎంతగా ప్రయత్నించినా, ఆ దేశం వంచిస్తోంది. భారత్‌పైన ప్రచ్చన్న యుద్ధం చేస్తోందని ఆరోపించారు. పాక్ టెర్రర్‌కి కేంద్రంగా మారింది. దాని వల్ల ఒక్క భారత్ మాత్రమే కాదు. ప్రపంచ దేశాలన్నీ దాని విషఫలాలను అనుభవిస్తున్నాయని చెప్పారు. తాను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, సార్క్ దేశాల అధ్యక్షులందరినీ ఆహ్వానించాను, అందులో భాగంగా పాక్ ను పిలిచామని చెప్పారు. విదేశాంగ విధానంలో సమూలంగా మార్పునకు మేం చేసిన ప్రయత్నాలకు ప్రపంచం అంతా స్పందించింది. పాక్ విషయంలో ఆశించిన ఫలితాలను రాలేదని విచారం వ్యక్తం చేశారు.
99088 92065