
ప్రైవేటీకరణ యోచనే వద్దు: రామకృష్ణ
ఫ్యాక్టరీని పూర్తి సామర్థ్యంతో నడపాలి: రవీంద్రనాథ్
ఒప్పంద కార్మికుల తొలగింపులు ఆపాలి: స్టీల్‌ప్లాంట్ జేఏసీ
రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆందోళన
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకు అప్పగించకుండా రక్షించుకుందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాల ఐక్యవేదిక అధ్వర్యాన ఆందోళనలలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూళీ సాంబశివరావు అధ్యక్షతన నిరసన జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచనను కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లాభాల్లో ఉన్న పరిశ్రమను నష్టం వస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయడాన్ని గమనించాలని ప్రజలను కోరారు. కేంద్ర కుట్రలను ఎండగట్టి, ప్రజలకు వాస్తవాలను వివరించాలని కార్మిక సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు కమ్యూనిస్టు పార్టీ తన సర్వశక్తులూ ఒడ్డుతుందన్నారు. ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఈ సంస్థ పరిరక్షణ కోసం ఏకం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ మాట్లాడుతూ లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తున్న ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించి పూర్తి సామర్థ్యంతో నడిపించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌వీ నర్సింగరావు మాట్లాడుతూ పరిశ్రమకు అందిస్తున్న బొగ్గును రద్దు చేయటం సబబు కాదని, ఉద్యోగుల తొలగింపులు, జీతాలు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు, సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి లంక దుర్గారావు, నక్క వీరభద్రరావు, ఏఐటీయూసీ నాయకుడు కొట్టు రమణారావు, నాయకులు తాడి పైడయ్య సంగుల పేరయ్య, ముఠా తిరుపతయ్య, భత్తుల రాంబాబు, బిల్డింగ్ నాయకులు రమణ, బేవర శ్రీనివాసరావుతో పాటు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
సెయిల్‌లో విలీనం చేయాలి: ఓబులేసు
‘ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు’ అని, దీనిని సెయిల్‌లో విలీనం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పి. హరినాథ రెడ్డి అన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్‌డీ రవి, సీఐటీయూ నగర కార్యదర్శి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన నిరసనలో ఓబులేసు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు 1,492 రోజులుగా వీరోచితంగా పోరాడుతున్నారన్నారు. ప్రజల ఆస్తిని కార్పొరేట్‌కు అప్పగించేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తోందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వరాదని అన్నారు. ఫ్యాక్టరీని సెయిల్‌లో విలీనం చేసి పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయమని ఎందుకు ప్రకటించడం లేదని ఓబులేసు నిలదీశారు. విశాఖ ఉక్కు ప్రైవేటుకు అప్పగించమని ప్రకటించేలా కేంద్రంపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తేవాలని అన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.బాలసుబ్రమణ్యం. ఐఎఫ్‌టీయూ నాయకులు వెంకటరత్నం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
నాయకులపై నిర్బంధం ఆపాలి: స్టీల్‌ప్లాంట్ జేఏసీ డిమాండ్
విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించి, పూర్తి సామర్థ్యంతో నడిపించాలని, ఒప్పంద కార్మికుల తొలగింపులు, యూనియన్ నాయకులకు ఇచ్చిన అక్రమ షోకాజ్‌లు రద్దు చేయాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ అధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురజాడ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన జరిగింది. కూడలిలో మానవహారం నిర్వహిం చారు. అనంతరం సభలో జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు, ఏఐటీ యూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్‌జే అచ్యుతరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఐఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. నాగభూషణం, సీిఎఫ్‌టీయూఐ జాతీయ అధ్యక్షుడు ఎన్. కనకారావు తదితరులు మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్ రక్షణ కోసం విశాఖ ఉక్కు కార్మికులు గాజువాకలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకోవడాన్ని, స్టీల్‌ప్లాంటు నేతలపై నిర్బంధ చర్యలను జేఏసీ నేతలు తీవ్రంగా ఖండిరచారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం మన్మధరావు, ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు, ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.తిరుపతిరావు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎంఏ బేగం తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో
ఒంగోలు ఆర్టీసీ డిపో సెంటర్లో వామపక్షాలు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల అధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం సుబ్బారావు దీనికి అధ్యక్షత వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కే మాభు, ఏఐఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు ఎంఎస్. సాయి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకుడు మోహన్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు శ్రీరామ శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు పిలుపునిచ్చారు.
అనంతపురంలో
అనంతపురం టవర్ క్లాక్ వద్ద సీపీఐ, ఏఐటీయూసీ, రైతు సంఘం, ఏఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్, మహిళా సమాఖ్య అధ్వర్యంలో నిరసన జరిగింది. టవర్ క్లాక్ చుట్టూ ప్రదర్శన నిర్వహిస్తూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రదర్శనకారులు నినాదాలిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్, సహాయ కార్యదర్శులు పి. నారాయణస్వామి, సి. మల్లికార్జున, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజారెడ్డి తదితరులు ప్రసంగించారు.
ఏలూరులో
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రప్రభుత్వ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ సెంటర్లో నిరసన నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీల అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక నేతలు డీఎన్ వీడి ప్రసాద్, కె.బుచ్చిబాబు, బి.వెంకటరావు, బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలి, సొంత గనులు కేటాయించాలి, సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్లతో కార్మిక సంఘాల సమన్వమ కమిటీ అధ్వర్యంలో గుంటూరు లాడ్జిసెంటర్‌లో నిరసన జరిగింది. సీఐటీయూ నగర పశ్చిమ ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి ఏఐఎఫ్‌టీయూ(న్యూ) నాయకులు కూరపాటి కోటయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనిరాజు, ఏఐటీయూసీ నాయకుడు బుజ్జి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జంగాల చైతన్య ప్రసంగించారు.