

. పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలి
. కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
. కేంద్ర కార్మిక సంఘాల అధ్వర్యాన రాష్ట్రవ్యాప్త ధర్నాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర పన్నుతోందని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. కార్మికుల తొలగింపు, గనుల కేటాయింపులో నిర్లక్ష్యం దీనిలో భాగమేనన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని, తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవా లని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విశాఖ ఉక్కు రక్షణ, కార్మికుల తొలగింపుపై ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాయి. దీనిలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టిన ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఇప్పటికే 2,500 మందిని తొలగించగా, మరో 14 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 మంది పర్మినెంట్ ఉద్యోగులను కూడా వీఆర్‌ఎస్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఇటీవల ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయమని, దీనిని ఆదుకోవడం కోసం రూ15 వేల కోట్లు ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పారని గుర్తు చేశారు. వీటిలో కేవలం రూ.11 వేల కోట్లు మాత్రమే ఇచ్చి… వాటిని పరిశ్రమ అభివృద్ధికి గానీ, ఉత్పత్తి అవసరాలకు గానీ, కార్మికుల జీతభత్యాలకు కానీ వాడరాదని షరతు పెట్టారని తెలిపారు. ఈ డబ్బులు కేవలం యాజమాన్యం చేసిన అప్పులు చెల్లించాలని ఆదేశించారని, దీనివల్ల కార్మికులకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. సీఐటీయు రాష్ట్ర నాయకులు నరసింహులు మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తిని దెబ్బతీసే విధంగా బ్లాస్ట్ ఫర్నేస్‌లు మూసివేసి గంగవరం పోర్టులో ఉన్న ముడి సరుకు ఇవ్వకుండా ఫ్యాక్టరీకి నష్టం కలుగచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉక్కు పరిశ్ర మను ప్రైవేటీపరం చేయబోమని కార్మికు లను నమ్మించి… తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీ యూసీ నగర కార్యదర్శి మూలే సాంబశివ రావు, సీఐటీయూ నగర నాయకులు దుర్గారావు అధ్యక్షత వహించగా ధర్నాలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు ఆంజనే యులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నగర సహాయ కార్యదర్శి చల్లా వెంకటరమణ, ప్రభుదాసు, బ్రేవారా శీను, సీఐటీయూ నగర కార్యదర్శి వెంకటేశ్వర రావు, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు రమణ, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
కుట్రపూరిత చర్యలను ఎదుర్కొందాం: వెలుగూరి
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ఐక్యంగా ఎదుర్కోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆకిటి అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో రాధాకృష్ణమూర్తి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, ఏఐఎఫ్‌టీయూ(న్యూ) జిల్లా కార్యదర్శి కూరపాటి కోటయ్య మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని మాయమాటలు చెబుతూ ప్రైవేటీకరణ దిశగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
విశాఖ ఉక్కుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి: హరినాథరెడ్డి
లాభాలు తెస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఈ పరిశ్రమను ప్రైవేటుపరం చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, తొలగించిన 4 వేల మంది కాంట్రాక్ట్ ఉక్కు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పి.హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ అధ్వర్యాన నిర్వహించిన ధర్నాలో హరినాథ్‌రెడ్డి ప్రసంగించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న పరిశ్రమను కాపాడు కునేంతవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్ర మంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాధాకృష్ణ , ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి కార్మిక సంఘ నాయకులు వినతపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, ఐఎఫ్‌టీయూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా కార్యదర్శి ఎ.అప్పలరాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, ఐఎఫ్‌టీయూ ఏలూరు నగర కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబుదే బాధ్యత: రావులపల్లి
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత సీఎం చంద్ర బాబుదేనని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కూటమి ప్రభుత్వం… కేంద్రం కుట్ర చర్యల పట్ల స్పందించకపోవడం బాధాకరమన్నారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, భవిష్యత్తులో తొలగింపు లకు స్వస్తి పలకాలని, పరిశ్రమకు సొంత గనులు కేటాయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని రవీంద్రనాథ్ హెచ్చరించారు.