విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశా లను పురస్కరించుకుని సోమవారం ఉభయసభలనుద్దే శించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగ కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిష్క రించారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డితో పాటు ఆపార్టీ సభ్యులంతా శాసనసభకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభించగానే వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రెడ్‌బుక్ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. సుమారు 10 నిముషాల పాటు ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సాగిన వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగం కొనసాగించారు. అనంతరం జగన్‌తో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు సభకు గైర్హాజరయితే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వారు సభకు హాజరయ్యారని కూటమి నేతలు విమర్శించగా, రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని వైసీపీ నేతలు మండిపడ్డారు.