. అభివృద్ధి కేంద్రంగా ఏపీ
. ఆగస్టు 15 నుంచి మహిళలకు ‘ఉచిత బస్సు’
. సీమ ముఖచిత్రాన్ని మార్చింది తెలుగుదేశమే
. పెద్దనోట్ల రద్దుతోనే అవినీతి నిర్మూలన
. మహానాడులో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – కడప : అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రం ఫస్ట్’ మన సంకల్పమని, సానుకూల రాజకీయాలు మన విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక ప్రాంతీయ పార్టీగా 45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించిన ఏకైక పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు. 1982లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మొదలు… నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటం చేశామన్నారు. మంగళవారం కడపలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. తొలిరోజు సమావేశంలో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు. తొలుత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి, జ్యోతిని వెలిగించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడు అంటే అదే జోరు. అదే హోరు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నా మనసు ఉప్పొంగుతోంది. దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. మహానాడులా వేలాదిమంది ప్రతినిధులతో మంచిచెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ మాత్రం తెలుగుదేశమేనంటూ చంద్రబాబు ప్రతినిధులను ఉత్తేజపరిచే ఉపన్యాసం చేశారు. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతి గుర్తొస్తుంది. తొలిసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి మహానాడు దేవుని గడప కడపలో ఏర్పాటు చేశాం. కడప గడ్డపై ఈ మహానాడు చూస్తుంటే…ఎన్నికలు అయ్యి ఏడాదైనా కార్యకర్తల్లో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి కడపలో 10కి ఏడుస్థానాలు గెలిచి సత్తాచాటాం. ఈసారి మరింత కష్టపడితే 10కి 10 గెలుస్తామన్న ఉత్సాహం కనపడుతోందన్నారు. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం. పార్టీ పని అయిపోయిందని మాట్లాడినవారి పనే అయిపోయింది కానీ టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉందన్నారు. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం, నేను చేసిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర, లోకేష్ యువగళం వరకూ కార్యకర్తల్లో అదే స్పూర్తి కనపడుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎందరో కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. వారి స్పూర్తి టీడీపీలో శాశ్వతంగా ఉంటుందని, వారికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం
రాజకీయాల్లో సామాజిక న్యాయం టీడీపీ తెచ్చిన అతిపెద్ద విప్లవం. అట్టడుగు వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చాం.మన తర్వాత దేశంలో అన్ని పార్టీలు బీసీలను గుర్తించే పరిస్థితి వచ్చిందన్నారు. సంస్థాగతంగా దేశంలో బలమైన పార్టీ టీడీపీ. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి కోటి సభ్యత్వాతలను 45 రోజుల్లోనే పూర్తి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. జాతీయ రాజకీయాల్లోనే టీడీపీ కీలక పాత్ర పోషించిందని వివరించారు.
అభివృద్ధికి కేరాఫ్ ఏపీ కాబోతోంది
స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే 22 ఏళ్లలో అంతకుమించి రెట్టింపు అభివృద్ధి జరిగి ఏపీ కేరాఫ్‌గా మారబోతుందన్నారు. మహానాడులో నదుల అనుసంధానం, పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీరిచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చేలా తీర్మానం చేస్తామన్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు నాంది పలుకుతాం. రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు వంటివి చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్ కాస్ట్ తగ్గేలా మన ఆలోచనలు ఉంటాయి. అలాగే క్వాంటమ్ వ్యాలీ, ఏఐకి ప్రాధాన్యత ఇచ్చి తెలుగుజాతిని ముందుకు నడిపిస్తాను. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం మన విధానమని స్పష్టం చేశారు. రాబోయే పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే కాదు మనం అనుకున్న విధానాలు అమలు చేసి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా చేసే బాధ్యత మనందరిదీ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఆగస్టు 15నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
పేదల్లో ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించడమే లక్ష్యమని, దీనిలో భాగంగా ఎన్నికల హామీలో పేర్కొన్న మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగస్టు 15నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి రూ.4 వేలు, రూ.6 వేలు, రూ. 10 వేలు, రూ. 15 వేలు పింఛను ఇచ్చే ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటేనన్నారు. ఏటా రూ.33 వేల కోట్లు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అందిస్తున్నామని, మరోపక్క అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు. దీపం పథకంతో కోటి మందికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. ఉచిత ఇసుక, మత్సకారుల సేవలో ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. డీఎస్సీ నోటిఫికేషప్ ఇచ్చాం. స్కూళ్లు తెరిచేలోగా తల్లికి వందనం అందిస్తామని చెప్పారు. అన్నింటికి మించి పారిశ్రామిక వేత్తలతో నమ్మకం కల్పించి పెట్టుబడులు తెస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులు పెట్టి 76 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. దీనివల్ల రూ.4 లక్షల 96 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, తద్వారా 4 లక్షల 57 వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చంద్రబాబు వివరించారు.