
కమ్యూనిస్టు పార్టీ ప్రగాఢ సంతాపం
విశాలాంధ్ర – హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడు సురవరం సుధాకర రెడ్డి(83) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య బీవీ విజయలక్ష్మి, కుమారులు అఖిల్, కపిల్ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ దగ్గరలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న ఆయన జన్మించారు. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి సుధాకర రెడ్డికి బాబాయి. కొల్లాపూర్ శాసనసభా నియోజకవగం నుంచి పోటీ చేసినా విజయం సాధించలేక పోయారు. 12వ లోక్‌సభలో, 14వ లోక్‌సభలో నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. లోక్‌సభ సభ్యుడిగా ఆయన అనేక కమిటీలకు సారధ్యం వహించారు. కొన్ని కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 2జీ కుంభకోణాన్ని బయట పెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఎన్నికల రాజకీయాలలోకి దిగక ముందు ఆయన సీపీఐ అనుబంధ విద్యార్థి, యువజన సంఘాల్లో కీలక పాత్ర పోషించారు. యువజన సమాఖ్య ప్రచురించిన ‘యువజన’ పత్రికకు సంపాదకవర్గ సభ్యులుగా ఉండేవారు. 1975-76లో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన కొత్త బాట వార పత్రికలో వారం వారం రాజకీయ వ్యాఖ్యానాలు రాసే వారు. విశాలాంధ్రలో ఆయన అపారమైన సంఖ్యలో వ్యాసాలు రాశారు. 1998లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పుడు మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడిగా పని చేశారు. అదే సమయంలో ఆ కమిటీలో భాగమైన ఔషధ ధరల నియంత్ర కమిటీ సభ్యులుగా 1998నుంచి 1999 దాకా కొనసాగారు. ఆర్థిక శాఖ సలహా కమిటీ సభ్యులుగా ఉన్నారు. 2004లో రెండవసారి మళ్లీ లోక్‌సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1970ల ఆరంభం నుంచి కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి సభ్యులుగా, ఆ తరవాత కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శి వర్గ సభ్యుడిగా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తరవాత ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. మూడవసారి ఎన్నికైన తరవాత కొద్ది నెలలు మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తించారు. క్రమగా పార్టీ పదవుల నుంచి తప్పుకున్నారు. అయినా రాజకీయ కార్యకలాపాలకు ఎన్నడూ దూరంగా లేరు. వ్యక్తిగా ఆయన చాలా సౌమ్యుడు. వక్తగా అద్వితీయుడు. ఇతర నాయకుల ప్రసంగాలను తెలుగులోకి అనువదించడంలో దిట్ట. కర్నూలులో బీఏ ఉత్తీర్ణులయ్యక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. విద్యార్థి దశనుంచే ఆయన వామపక్ష రాజకీయాలలో భాగస్వామి. అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అఖిలభారత యువజన సమాఖ్య జాతీయ నాయకులుగా కొనసాగారు. సుధాకర రెడ్డి మంచి చదువరి. నిజానికి పుస్తకాల పురుగు. క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్న తరవాత ఎక్కువ సమయం పుస్తక పఠనంలోనే గడిపారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి కార్యదర్శిగా వరసగా రెండుసార్లు పని చేశారు. రాజకీయాలలో ఆయన మేధావిగా ప్రసిద్ధుడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సదస్సులు, గోష్టుల్లో పాల్గొన్నారు. ప్రజోద్యమాలను నిర్మించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆ క్రమంలో కనీసం కొన్ని డజన్ల సార్లు అరెస్టయ్యారు. జైలులో ఉన్నారు. అనేక కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణలో భాగంగా అనేక పోరాటాలకు రూపకల్పన చేశారు. అనేక రాష్ట్రాలలో జైలు శిక్షలు అనుభవించారు. లక్నో, కోల్‌కతా జైళ్లలో గడపాల్సి వచ్చింది. చంద్రబాబునాయుడు హయాంలో విద్యుత్ ఉద్యమంలో ఆయన తీవ్రంగా గాయపడడమే కాక జైలులో ఉండాల్సి వచ్చింది. మునుపటి సోవియట్ యూనియన్ సహా చైనా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మని, ఇటలీ, మంగోలియా, హంగేరి, బ్రిటన్, అమెరికా దేశాలలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీకి చాలాకాలం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సుధాకర రెడ్డి బహు గ్రంథ రచయిత.
నాయకుడు… తమ పార్టీకి, కేడర్‌కు, జాతి భవితకు ఓ రాడార్. తన మాటతో, చేతతో కార్యకర్తలను కదంతొక్కించడమే కాదు, తన వాదన పటిమతో ప్రత్యర్థులను పరుగులు పెట్టించడం, మేధావులు, నిపుణులు, విశ్లేషకుల మద్దతు పొందడం సమర్థ నాయకత్వ లక్షణం. అధ్యయనం, అవగాహన, ఆచరణ… త్రివేణి సంగమంగా మదిలో, హృదిలో మథనం జరిగితేనే జనాభ్యుదయం. దేశ హితం కాంక్షించే దశ, దిశలో తను సాగడమే కాదు, జాతిని కదిలించగలుగుతారు. అటువంటి వ్యక్తులే నిజమైన జాతి నేతలు కాగలుగుతారు. ప్రస్తుత రాజకీయాల్లో తనదైన విలక్షణత్వం, విశుద్ధ మార్గంతో మార్క్సిస్టు`లెనినిస్టు పంథాలో సమసమాజమే లక్ష్యంగా ముందుకు సాగిన నేత సురవరం సుధాకరరెడ్డి. మతవాద, మితవాద, బూర్జువా రాజకీయాల్లోని క్రూరత్వాన్ని, కుటిలత్వాన్ని, స్వార్థపూరిత దోపిడీ విధానాలను ఎండగడుతూ లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు అండగా నిలుస్తూ భారత కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా తన కర్తవ్యాన్ని త్రికరణశుద్ధిగా నిర్వహించిన, నిజమైన ప్రజా ఉద్యమ నేత ఆయన. పాఠశాల స్థాయి నుంచే ప్రశ్నించడం నేర్చున్నారు. విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు. తన వాగ్దాటితో జనాకర్షక నేతగా ఎదిగారు. తన అధ్యయనం, సైద్ధాంతిక బలంతో దార్శనికునిగా పేరొందారు. భూస్వామ్య కుటుంబమైనా ఎటువంటి భేషజాలు లేవు. రజాకార్లు తమ ఇంటిని తగలబెట్టినా, కుటుంబాన్ని వెంటాడినా వెరవకుండా ప్రజా ఉద్యమబాట పట్టారు. ప్రతి ప్రతిబంధకాన్నీ తన పోరాటానికి నిచ్చెన మెట్లుగా మలచుకున్నారు. పాలకులు పట్టి జైల్లో పెట్టినా… ఆ సెల్‌నే ఉద్యమాలకు పురుటిగదిగా మార్చుకున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కమ్యూనిస్టుగా ముందుగా స్పందించడం, దానితో పాటు తానున్నాంటూ ఆయన ప్రజాక్షేత్రంలో ఉద్యమబావుటా ఎగురవేయడం ఆయనకు నిత్యకృత్యం. పోరాటాల గడ్డ నల్లగొండ నుంచి పార్లమెంటులో అడుగుపెట్టినా… కార్యకర్త నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగినా ఆయన ఆలోచన, ఆచరణలో ఏ మార్పులేదు. నిరాడంబరత ఆయన శైలి. నల్లకుబేరుల జాతకాలపై తొలిసారి పార్లమెంటు వేదికగా గళం విప్పిన ఘనత ఆయన సొంతం. ఎర్రజెండా చేతబట్టి దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరు సాగించారు.
సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గం సంతాపం
మన ప్రియమైన మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్. సుధాకర్ రెడ్డి మృతిని సిపిఐ తీవ్ర దుఃఖంతో ప్రకటిస్తోంది. 1942లో జన్మించిన కామ్రేడ్ సుధాకర్ తన జీవితాంతం కార్మికవర్గం మరియు అణగారిన వర్గాల పోరాటాలకు అంకితం చేశారు, 2012 నుండి 2019 వరకు సిపిఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు మరియు లోక్‌సభలో రెండుసార్లు నల్గొండకు ప్రాతినిధ్యం వహించారు. ప్రజల కోసం జీవితాంతం పోరాడిన ఆయన, సిపిఐ %డ% వామపక్ష ఉద్యమం పట్ల తన వినయం, స్పష్టత, అచంచల నిబద్ధతకు గుర్తుండిపోతారు. రెడ్ సెల్యూట్, కామ్రేడ్. మీరు మా పోరాటాలలో ఎప్పటికీ జీవిస్తారు.
గొప్పనేతను కోల్పోయాం: రామకృష్ణ
సురవరం సుధాకరరెడ్డి మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సురవరం సుధాకరరెడ్డి మరణం బాధాకరం. తాను నమ్మిన సిద్ధాంతం కోసం, కమ్యూనిస్టు పార్టీ ఉన్నతి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవిత చరమాంకం వరకు ఆయన శ్రమించారు. 2012 నుండి 2019 వరకు సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ నుండి సీపీఐ అభ్యర్థిగా రెండు పర్యాయాలు విజయం సాధించి పార్లమెంటులో ప్రజా సమస్యలపై గళమెత్తి ప్రజావాణి వినిపించారు. వామపక్ష ఉద్యమాలలో ఎనలేని పాత్ర పోషించారు. కమ్యూనిస్టు పార్టీ పురోభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. వినయం, అచంచల నిబద్ధతకు ఆయన మారుపేరు. సుధాకరరెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. అనర్గల ఉపన్యాసకుడిగా, జననేతగా పేరుగాంచిన సురవరం సుధాకరరెడ్డి మరణం పట్ల సిపిఐ రాష్ట్ర సమితి తరపున ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖుల సంతాపం
సురవరం సుధాకరరెడ్డి మృతికి ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. సురవరం మృతికి సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తదితరులు సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.


