. నిరుపేదలకు భూములు పంచిన ఘనచరిత్ర ఎర్ర జెండాదే
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. రాజ్యాంగ పరిరక్షణ కోసం తిరుపతిలో భారీ ర్యాలీ
విశాలాంధ్ర – తిరుపతి: స్వాతంత్య్ర పోరు మొదలుకొని భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేదలకు భూములు పంచిపెట్టడం వరకూ కమ్యూనిస్టులది ఘన చరిత్ర అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం సీపీఐ చేపట్టిన ప్రచార కార్యక్ర మంలో భాగంగా తిరుపతిలో బైరాగి పట్టెడ రామానాయుడు స్కూల్ నుంచి సీపీఐ కార్యకర్త భారీ ర్యాలీ నిర్వహించారు. మతోన్మాద బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సీపీఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగసభకు ముఖ్య అతిధిగా హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ… స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ కీలక పాత్ర వహించిందన్నారు. అంతే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడం ద్వారా 4వేల మంది ప్రాణత్యాగంతో లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర సీపీఐదేన్నారు. కేరళలో జరిగిన పున్నవ ప్రవయలర్ పోరాటం గురించి ప్రస్తావించారు. 1925లో ఏర్పడిన ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటిష్ వారితో లాలూచీ పడిరదని… వారు మహాత్మాగాంధీని అవమాన పరుస్తూ మాట్లాడుతున్నారన్నారు. ఈ దేశ హోంమంత్రి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరచడం మంచిది కాదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ దేశంలో అనేక రాష్ట్రాల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టిస్తున్నాయని మండి పడ్డారు. సీపీఐ జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మార్చి23 స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్ వర్ధంతి రోజు నుంచి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు రాజ్యాంగ పరిరక్షణ, రాజకీయ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 500 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. రామానాయుడు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, ఆదివాసీలపై దాడులు పెరిగాయన్నారు. పేదల పక్షాన నిలిచిన చరిత్ర బీజేపీకి లేదని… కేవలం దేవాలయాలు, మతాల చుట్టూ తిరుగుతూ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. చేగువేరా ఫోటో పెట్టుకుని సనాతన ధర్మం అని పవన్ కల్యాణ్ మాట్లాడటం శోచనీయం అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలని పిలునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, నగర కార్యదర్శి జె.విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కత్తి రవి, బండి చలపతి, ఉదయ్ కుమార్, నగర కార్యవర్గ సభ్యులు కె.పద్మనాభ రెడ్డి, ఎం.రామకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, ఎండి ప్రసాద్, వైయస్ మణి, ఎన్ శివ తదితరులు పాల్గొన్నారు.