ఉగ్రదాడి మృతులు చంద్రమౌళి, మధుసూదన్‌కు చంద్రబాబు సంతాపం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ తెలుగు సంఘం సభ్యులు జేఎస్ చంద్రమౌళి, మధుసూదన్‌లకి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఈ తీవ్ర దుఃఖ సమయంలో తమ ఆలోచనలు, ప్రార్థనలు వారి కుటుంబాలకు అండగా ఉంటాయని, ఈ అపారమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని వారు పొందాలని తాను ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉగ్రవాదులు హింసను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల ఏదీ సాధించలేరని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఫీుభావంగా నిలుస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తీవ్రవాదంపై ధృఢమైన, నిర్ణయాత్మక చర్యతో ప్రతిస్పందించడానికి నిబద్ధతతో ఉన్నారని చెప్పారు. ఈ హేయమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు.
ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి మృతదేహం రాత్రికి విశాఖపట్నం చేరుకోగా… సీఎం చంద్రబాబు కూడా ఒంగోలు నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి చంద్రమౌళి భౌతికకాయానికి నివాళులర్పించారు. గురువారం ఉదయం చంద్రమౌళి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
ఏపీ భవన్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
ముఖ్యమంత్రి ఆదేశాలతో పహల్గాం ఉగ్రదాడి ఘటనపై బాధితుల సహాయార్థం ఏపీ భవన్‌లో ఎమర్జెన్సీ డెస్క్ ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్‌కు వెళ్లిన తెలుగు ప్రజల సహాయార్థం దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీ భవన్‌లో 9818395787 (వి.సురేశ్‌బాబు) నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.