వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయానికి ఆయన సొంత దేశంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా లక్ష డాలర్ల (సుమారు రూ.88 లక్షలు) ఫీజు విధించాలన్న ఆయన ప్రతిపాదనను సవాలు చేస్తూ, దేశంలోని ప్రముఖ వాణిజ్య సంస్థ ‘యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్’ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు కొలంబియా జిల్లా కోర్టులో దావా దాఖలు చేసింది. ట్రంప్ సర్కార్ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలను, పోటీతత్వాన్ని దెబ్బతీసేలా ఉందని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని తన పిటిషన్లో పేర్కొంది. సెప్టెంబర్ 19న ట్రంప్ జారీ చేసిన ఈ ప్రకటన ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టాన్ని ఉల్లంఘిస్తోందని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆరోపించింది. వీసాలపై కాంగ్రెస్‌కు ఉన్న అధికారాన్ని అధ్యక్షుడు అతిక్రమించారని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో హోంల్యాండ్ సెక్యూరిటీ, విదేశాంగ శాఖలతో పాటు వాటి కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ నిర్ణయంపై చాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ బ్రాడ్లీ మాట్లాడుతూ, ‘‘ఈ భారీ ఫీజు వల్ల స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా సంస్థలు విదేశీ నిపుణులను నియమించుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతుంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షుడికి విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ చేసిన చట్టాలను ఆయన ఉల్లంఘించలేరని చాంబర్ తన వాదన వినిపించింది. హెచ్-1బీ వీసా హోల్డర్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తున్నారని, వారు కొత్త ఉద్యోగాలు సృష్టించడంతో పాటు అమెరికన్ల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఆవిష్కరణలకు కారణమవుతున్నారని తెలిపింది. ట్రంప్ తాజా నిర్ణయం ఈ ప్రగతిని తారుమారు చేస్తుందని హెచ్చరించింది. ఒకవైపు అమెరికా ఇలాంటి కఠిన నిబంధనలు విధిస్తుండగా, మరోవైపు చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ‘కే-వీసా’ పేరుతో కొత్త వర్క్ పర్మిట్‌ను ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
భారతీయులకు మరో ఎదురు దెబ్బ
యూఎస్ డైవర్సిటీ వీసా (డీవీ) లాటరీలో పాల్గొనేందుకు భారతీయులకు 2028 వరకు అవకాశం లభించదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమంలో గత ఐదేళ్లలో అమెరికాకు తక్కువ వలసలు ఉన్న దేశాల దరఖాస్తుదారులను ఎంచుకుంటున్నట్లు తెలిపాయి. ఏటా 50 వేల మంది లోపు అమెరికాకు వలసవచ్చే దేశాలకే అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. అమెరికాలో అన్ని దేశాలకు చెందిన వలసదారులకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీసా లాటరీలో పాల్గొనడానికి అనుమతి ఉన్న దేశాలకు తాజా వీసా కేటాయింపులను ప్రకటించారు. గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు అధికంగా వలసలు ఉండడంతో భారతీయులకు ఈ వీసా కార్యక్రమానికి కావాల్సిన అర్హత పరిమితి మించిపోయిందని.. అందువల్లే ఈ లాటరీ లో పాల్గొనడానికి వారికి అవకాశం ఇవ్వట్లేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
హెచ్-1బీ వీసా ఫీజుపై ట్రంప్ సర్కార్‌కు షాక్
- Advertisement -
RELATED ARTICLES


