. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవేకి కేంద్రం పచ్చజెండా
. డీపీఆర్ రూపకల్పనపై చర్యలకు ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నగరం ఏపీకి మరింత చేరువకానుంది. అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం పచ్చజెండా ఊపింది. డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖను హోంశాఖ ఆదేశించింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే నాలుగు గంటల వ్యవధిలోనే హైదరాబాద్ చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ, తెలంగాణకు సంబంధించిన పెండిరగ్‌లో ఉన్న వివిధ అంశాలపై ఆయా శాఖలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ 15 శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కేంద్ర రోడ్లు-ఉపరితల రవాణా, ఉక్కు, బొగ్గు గనులు, వ్యవసాయ, పెట్రోలియం, రైల్వే తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రతిపాదనలతో పాటు విభజన చట్టం ప్రకారం ఉన్న పెండిరగ్ అంశాలపై చర్చించారు. ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ పంపించింది. అలాగే తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ, అందుకుగల అవకాశాలను పరిశీలించాలని పెట్రోలియం శాఖకు హోంశాఖ సూచనలు చేసింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ముమ్మరంగా కొనసాగించాలని, రెండేళ్లలో అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖను ఆదేశించింది. విశాఖ, అమరావతి, కర్నూలు, హైదరాబాద్ కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని, దానిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గతంలో ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు పెండిరగ్‌లో ఉన్నందున విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తెలంగాణకు ఆ నిధుల విషయంపై నీతిఆయోగ్‌తో చర్చించాలని అధికారులకు హోంశాఖ సూచించింది.