న్యూదిల్లీ: ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలకమైన రక్షణ ఒప్పందానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందం. ఈ ఒప్పందానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఢిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంతో భారత వాయుసేన పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల ద్వితీయార్థంలో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగానే రక్షణ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. ఒప్పందం ప్రకారం 18 రఫేల్ యుద్ధవిమానాలను ‘ఫ్లై-అవే కండిషన’లో నేరుగా తీసుకువస్తారు. తక్కిన 96 విమానాలు భారత్లో అసెంబుల్ చేస్తారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, అసెంబెల్ కోసం రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, భారత్తోని ప్రైవేటు రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటారు. భారత వాయుసేన వద్ద ప్రస్తుతం 36 రఫేల్ యుద్ధవిమానాలు ఉన్నాయి.


