జిల్లాకోర్టుల ఉద్యోగాల భర్తీకి చర్యలు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వేర్వేరుగా పది నోటిఫికేషన్‌లు గురువారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ల ద్వారా మొత్తం 1620 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 13 నుండి జూన్ 2 వరకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులను జిల్లాలవారీగా భర్తీ చేయనున్నారు. ఏపీ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లు దాఖలు చేయవచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.800, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి విద్యార్హత కాగా… జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ విద్యార్హతగా పేర్కొన్నారు. కాపీయిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి. టైపింగ్ తప్పనిసరి. కంప్యూటర్ అనుభవం ఉండాలి. వయసు 42 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయసు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జిపై పరీక్ష ఉంటుంది. మొత్తం ఖాళీలు: 1620, వీటిలో జూనియర్ అసిస్టెంట్- 230, ఆఫీస్ సబార్డినేట్- 651, ప్రాసెస్ సర్వర్- 164, రికార్డ్ అసిస్టెంట్- 24, కాపీయిస్ట్- 193, ఎగ్జామినర్- 32, ఫీల్డ్ అసిస్టెంట్- 56, టైపిస్ట్- 162, స్టెనోగ్రాఫర్- 80, డ్రైవర్- 28 పోస్టులు ఉన్నాయి.