విశాలాంధ్ర – చింతూరు : చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కేంద్రంలో ఎస్పీ కిరణ్ చౌహాన్ ఎదుట 18 మంది మావోయిస్టులు మంగళవారం లొంగిపోయారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా దక్షిణ బస్తర్ డివిజన్ పీఎల్‌జీఏ ఒకటో నంబరు బెటాలియన్‌తో సంబంధం ఉన్న నలుగురు మావోయిస్టులతో పాటు 18 మంది లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.39 లక్షల రివార్డు ఉంది. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల లొంగుబాటు పునరావాసం విధానాన్ని కొనసాగిస్తోంది. ఈ పథకానికి ప్రభావితమై చాలామంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో చేరడానికి ముందుకు వస్తున్నారు. మావోయిస్టుల లొంగుబాటులో జిల్లా రిజర్వు గార్డ్స్, సుక్మా రేంజ్ ఫీల్డ్ టీం, కుంట, సుకుమా, జగదల్పూర్, సీఆర్‌పీఎఫ్ 80, 212, 219, కోబ్రా 203 బెటాలియన్ల నిఘా విభాగాలు కీలకపాత్ర పోషించాయని ఎస్పీ చెప్పారు. మిగిలిన మావోయిస్టులు కూడా హింసామార్గం వీడి… ప్రభుత్వ పునరావాస పథకాలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తరచూ గాలింపు చర్యలు కొనసాగడం, భద్రత దళాలు శిబిరాలు ఏర్పాటు చేసుకోవడంతో మావోయిస్టులు బలహీనపడి లొంగిపోతున్నారని, దీని ఫలితమే ఈ లొంగుబాటలని ఎస్‌పీ తెలిపారు. సుకుమా జిల్లా, జగదల్పూర్, దంతెవాడ, బీజాపూర్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.