Homeఅంతర్జాతీయంహర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 2,000 నౌకలు

హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 2,000 నౌకలు

- Advertisement -

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన దాదాపు 2,000 వాణిజ్య నౌకలు హర్మూజ్ జలసంధి నుంచి బయటకు వచ్చేందుకు ఎదురుచూస్తున్నాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. గురువారం (28న) ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయని, నౌకల రాకపోకలకు మార్గం సుగమం అయితే ప్రపంచ చమురు సరఫరాలు వేగంగా పుంజుకుని, ధరలు తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో ఐదో వంతు హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. ఇది అత్యంత కీలకమైన వాణిజ్య మార్గం. ఈ ఏడాది ప్రథమార్ధంలో అమెరికా-ఇరాన్ మధ్య వివాదం ముదరడంతో ఈ మార్గంలో నౌకల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా కారణాలు, బీమా సమస్యలు, ఇరాన్ ఆంక్షల వల్ల గతంలో రోజుకు 100కి పైగా నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో రద్దీ పూర్తిగా పడిపోయింది. దీంతో వేలాది మంది నావికులు నౌకల్లోనే చిక్కుకుపోగా, ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. నిలిచిపోయిన వాటిలో అత్యధికంగా చమురు ట్యాంకర్లే ఉన్నాయి. ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ మే నెలలో చమురు ధరలు ఇప్పటికే 10 శాతం తగ్గాయని బెస్సెంట్ తెలిపారు. జలసంధిలో రాకపోకలు పూర్తిగా పునరుద్ధరణ అయితే, పెద్ద సంఖ్యలో వేచిచూస్తున్న నౌకల వల్ల చమురు సరఫరా మార్కెట్‌లో పుష్కలంగా ఉంటుందని ఆయన వివరించారు. హర్మూజ్ జలసంధిపై ఎలాంటి టోల్ విధించే ప్రణాళికలు లేవని ఒమన్ హామీ ఇచ్చిందని కూడా ఆయన ధ్రువీకరించారు. షిప్పింగ్ కంపెనీలలో విశ్వాసం నింపేందుకు అమెరికా ఇప్పటికే నౌకాదళ ఎస్కార్ట్‌లు, సముద్రయాన పునర్‌బీమా కార్యక్రమం వంటి చర్యలను ప్రకటించింది. నెలల తరబడి నౌకలు నిలిచిపోవడంతో వేలాది మంది నావికులు కుటుంబాలకు దూరంగా, అనిశ్చిత పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. మరోవైపు, షిప్పింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ, అణు ఒప్పందంపై చర్చలు పురోగమిస్తేనే నౌకల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఒకవేళ అదే జరిగితే చమురు మార్కెట్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ సరఫరా అంది, ధరలు వివాదానికి ముందునాటి స్థాయి కంటే కూడా కిందకు పడిపోవచ్చని బెస్సెంట్ అంచనా వేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు