కూటమి పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు, చెల్లింపులు, వాటి వినియోగంపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణను విస్మరించి పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వాలు మారినా రాష్ట్రంపై అప్పుల భారం పెరగడమేకానీ తగ్గడం లేదని ఈశ్వరయ్య విమర్శించారు. ప్రతి మంగళవారం అందినకాడికి అప్పులు చేస్తూ… మంగళవారాన్ని అప్పలవారంగా మార్చేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అప్పులు రికార్డు స్థాయికి చేరాయన్నారు. 26 నెలల్లో రూ.3,86,348 కోట్లు అప్పు చేసినట్లు తెలుస్తోందని, ఆర్థిక సంస్థలు ఇచ్చే అప్పులకు కూ{మి సర్కార్ పదేపదే గ్యారంటీలు ఇస్తూ జీవోలు జారీ చేస్తోందని వివరించారు. రాష్ట్రభివృద్ధి కేవలం మాటలకే పరిమితమవుతోందని, అప్పులు మాత్రం విచ్చలవిడిగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా మంగళవారం రూ.2,600 కోట్ల అప్పు చేశారని, దీంతో 26 నెలల్లోనే చంద్రబాబు సర్కారు చేసిన బడ్జెట్, బడ్జెటేతర అప్పులు ఏకంగా రూ.3,86,348 కోట్లకు చేరాయని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నెలకు సరాసరి రూ.11 వేల కోట్లకుపైగా బడ్జెట్ అప్పులు చేయగా… ఐదు నెలల్లో రాష్ట్ర అప్పు మొత్తం రూ.55,534 కోట్లు కావడం ఆందోళనకరమన్నారు. నెలవారీగా పన్ను రాబడిని మించి కూటమి ప్రభుత్వం అప్పు చేయడంతో వడ్డీల చెల్లింపులతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతోందని, ఫలితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. మరోపక్క కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ ఆస్తులను కూటమి సర్కారు ప్రైవేటు శక్తులకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ, ప్రజా ఆస్తుల ద్వారా ప్రభుత్వ ఆధీనంలోనే ఆదాయ మార్గాలు అన్వేషించకుండా కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా కారుచౌకగా అప్పగించేందుకు పావులు కదపడం దుర్మార్గమని తెలిపారు. తెచ్చిన అప్పులను ఆదాయం సమకూరే రంగాలపై వెచ్చించకుండా అనవసరపు ఆర్భాటపు ఖర్చులు అధికంగా చేస్తోందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల నెత్తిపై మరిన్ని భారాలు మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు, నిధుల వినియోగం తదితరాలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


