కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యను 50శాతం పెంచనున్నారు. అదే సమయంలో రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల కేటాయింపులో ఉన్న నిష్పత్తిని మరో 25ఏళ్ల పాటు కొనసాగించనున్నారు. అంటే 2051 వరకు రాష్ట్రాల వాటాలో ఎలాంటి మార్పు ఉండదు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ మార్పులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల వాటాకు 2051 వరకు రక్షణ!
కొత్త ప్రతిపాదన ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలు ఒకే నిష్పత్తిలో పెరగనున్నాయి. దీంతో ప్రతి రాష్ట్రానికి అదనపు స్థానాలు లభిస్తాయి. ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉన్నాయి. వీటిని 50 శాతం పెంచితే మొత్తం స్థానాల సంఖ్య సుమారు 816కు చేరుతుంది. అయితే రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న స్థానాల వాటా మాత్రం మారదు. జనాభా పెరుగుదలను నియంత్రించడంలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి.ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు దక్కి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా 2051 వరకు రాష్ట్రాల మధ్య స్థానాల కేటాయింపును యథాతథంగా కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధం!
నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 2, 3 తేదీల్లో రాజ్యసభ సమావేశం కానుంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ఏయే బిల్లులను తీసుకురానున్నారనే విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించలేదు.
50 శాతం పెంపు ఎందుకు కీలకం?
లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను నియోజకవర్గాల పునర్విభజనతో అనుసంధానించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నంలో భాగంగా ఈ మార్పులు ప్రతిపాదించారు. 50శాతం స్థానాల పెంపుతో పార్లమెంట్లో మరిన్ని స్థానాలు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి కొనసాగుతుంది. జనాభా పెరుగుదలను సమర్థంగా నియంత్రించిన రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరగకుండా చూడటమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. గతంలో కూడా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడం వల్ల అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని,దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని కేంద్రం పార్లమెంట్‌కు హామీ ఇచ్చింది. అయితే ఈ హామీలను మాటలకే పరిమితం చేయకుండా చట్టంలో స్పష్టంగా పొందుపరచాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
గతంలో లోక్‌సభలో వీగిన బిల్లు
తాజా ప్రతిపాదనలో 2051 వరకు రాష్ట్రాల మధ్య స్థానాల కేటాయింపును మార్చకూడదనే నిబంధనను చేర్చడం ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నం విఫలమైన ఏడు నెలల తర్వాత ఈ తాజా నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిపోయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది సభ్యులు ఓటు వేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభకు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. అయితే ఆ బిల్లు ఈ సంఖ్యను సాధించలేకపోయింది.
జనగణన తర్వాతే మహిళా రిజర్వేషన్ల అమలు
లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడంతో పాటు పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా రాజ్యాంగంలో మార్పులు చేయడం గత బిల్లు ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన బిల్లును,కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలకు సంబంధించిన మరో బిల్లును కూడా ప్రవేశపెట్టింది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగతా ప్రతిపాదనలపై ముందుకు వెళ్లలేదు. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని 2023లో తీసుకొచ్చిన రాజ్యాంగ (106వ సవరణ) చట్టంలో పొందుపరిచారు. అయితే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలనే నిబంధన ఉంది.
బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి
ఈ ప్రక్రియను ముందుకు తీసుకొచ్చి, 2029 లోక్‌సభ ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ తాజా ప్రయత్నంగా కనిపిస్తోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినంత మాత్రాన రాజ్యాంగంలో మార్పులు జరిగినట్లు కాదు. తాజా ప్రతిపాదనను పార్లమెంట్లో బిల్లుగా ప్రవేశపెట్టి, రాజ్యాంగం నిర్దేశించిన మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీని సాధించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మార్పులు చట్టరూపం దాలుస్తాయి.


