Homeసంపాదకీయం70 ఏళ్లకు తెమిలిన కేసు!

70 ఏళ్లకు తెమిలిన కేసు!

- Advertisement -

ఏ విషయంలోనైనా కోర్టుకెకక్కడానికి ఎక్కువ ఓపిక కావాలా లేదా గుండె దిటవు చేసుకుంటే ఉరికంబం ఎక్కడానికి ఎక్కువ మానసిక సంసిద్ధత కావాలా అని అడిగితే రెండోదే సులభం అనిపిస్తుంది. 70 ఏళ్ల కిందట దాఖలైన ఒక కేసులో సుప్రీం కోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. అలాంటిది న్యాయం నత్తనడక అన్యాయం అని నత్తను నిందించడం అంతకన్నా అన్యాయం కాదా! 1957లో కుదిరిన ఒక అమ్మకం ఒప్పందం విషయంలో దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. ఈ కేసు తెమిలే నాటికి నాలుగు తరాలు గడిచిపోయాయి. “వీణ్ని పన్నెండు కోర్టులంటా తిప్పకపోతే నా పేరు రామప్పంతులే కాదు” అని గిరీశాన్ని ఉద్దేశించి రామప్పంతులు అంటాడు. కోర్టుల వెంట తిప్పడం అంటే ఏమిటో రామప్పంతులుకు దండిగా అనుభవం ఉండే ఉంటుంది. ఇప్పుడు మన సుప్రీంకోర్టులోనే ఒక కేసు తెమలడానికి 70 ఏళ్లు పట్టిందంటే సత్వర న్యాయం ఎన్ని యుగాల దూరంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 70 ఏళ్ల తరవాత తేలిన కేసు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని నర్సీపూర్ కలాన్ గ్రామానికి సంబంధించింది. వివాదంలో ఉన్న భూమి 15.5 బిగాలు. తీర్పు వచ్చేసరికి ఈ కేసుతో సంబంధం ఉన్నవారు పెట్టిన ఖర్చు భూమి ధర కన్నా అనేక రెట్లు ఎక్కువే ఉంటుంది. సరఫత్ అలీ అనే వ్యక్తి పూర్వీకులు 1954 జూన్ 4న ఈ భూమి కొన్నారు. అప్పటి నుంచి కోర్టు ఎక్కే మెట్లు, దిగే మెట్లతోనే సరిపోయింది. సంతోషించవలసింది ఏమిటంటే చివరకు తీర్పు సరఫత్ అలీకి అనుకూలంగానే వచ్చింది. ఆలస్యమైనా న్యాయం జరిగిందనుకుని సంతృప్తి పడాలి. పండగ చేసుకోవాలి. సుదీర్ఘ కాలం తరవాత ఈ కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎన్.వి.అంజారియా. ఒక రకంగా వారి జీవితంలోనూ ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిందే. ఈ భూమి కొన్నప్పుడు తీర్పు వచ్చిన తరవాత ఉన్న సరఫత్ లాంటి వారు మైనారిటీ తీరని వారు. ఆ భూమి అప్పటి నుంచీ వారి అధీనంలోనే ఉందట. భూమి కొన్న తరవాత 1984లో సరఫత్ ఈ భూమిని రికార్డుల్లోకి చేర్పించగలిగారు. అప్పుడు అమ్మిన వారిలో ఒకరు కేసు నుంచి ఉపసంహరించుకున్నారు. వివిధ కారణాల వల్ల సరఫత్ ఖాన్ ఈ భూమికి యజమాని అని ప్రకటించలేదు. మొత్తం మీద 2017లో హైకోర్టు సరఫత్ ఖాన్కు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. కొన్న వారు భూమిని రికార్డుల్లో తమ పేర రాయించే క్రమంలో ఉత్తరప్రదేశ్ జమీందారీ రద్దు, భూసంస్కరణల రద్దు లాంటి అనేక అంశాలు ఈ కేసును జటిలం చేశాయి. భూ యజమానులు ఎన్ని చోట్లకు తిరిగినా ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. కోర్టుల చుట్టూ తిరగలేక చాలా మంది విసిగిపోయి ఆస్తి వదులుకునే సందర్భాలూ ఉంటాయి. కాదు కూడదని పట్టు వదలని విక్రమార్కుడిలా కోర్టుల చుట్టూ తిరిగితే తమ భావితరాల సమయంలో తీర్పు వస్తుందని ఈ కేసు నిరూపిస్తోంది.
సాధారణంగా సివిల్ కేసుల్లో అంటే ఆస్తి తగాదాలు, గట్టు తగాదాలలో కోర్టు కేసులు ఓ పట్టాన తేలవు. అంతకుముందు రెవెన్యూ సిబ్బంది చుట్టూ ఎన్నేళ్లు తిరుగుతారో లెక్కేలేదు. వివిధ కారణాల వల్ల వాయిదాలతోనే సరిపెట్టేస్తుంటారు. కేవలం సివిల్ కేసులే కాకుండా రాజ్యాంగ సంబంధమైన కేసులు కూడా ఏళ్ల తరబడే కాదు దశాబ్దాలు గడిచినా తేలని సందర్భాలు తక్కువేమీ లేవు. సాధారణంగా సివిల్ కేసులు తేలడానికి కనీసం రెండేళ్ల నుంచి అయిదేళ్లు పడ్తుంది. ఒక వేళ ఈ కేసులు కింది కోర్టుల్లో, హైకోర్టులో తేలకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లవలసి వస్తే పది నుంచి 20ఏళ్ల లోపు తీర్పు వస్తే ఏదో విచిత్రం జరిగినట్టే లెక్క. మన దేశంలో కోర్టుల్లో పేరుకుపోయే కేసులు కోట్లలో ఉంటాయి. కింది కోర్టులు, హైకోర్టుల్లో తెమలని కేసులను కూడా లెక్కేస్తే గుండె చెరువైపోవడం ఖాయం. ఎందరు ప్రధాన న్యాయమూర్తులు మారినా పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి మార్గం కనిపెట్టలేకపోయారు. కొంతమంది ప్రధాన న్యాయమూర్తులు ప్రయత్నించి విఫలమయ్యారు. కేసులు పేరుకుపోవడం కేవలం వ్యక్తులుగా న్యాయమూర్తుల బాధ్యత కాదు. అసలు వ్యవస్థలోనే సాగదీసే తత్వం ఉంది.దీర్ఘ కాలికంగా తేలకుండా ఉన్న కేసుల గురించి సమాచార హక్కు చట్టం కింద అడిగితే మూడు దశాబ్దాలు, అంతకన్నా ఎక్కువ కాలం నుంచి పేరుకుపోయిన కేసులు కనీసం 24 ఉన్నాయి. విచారణ ముగియని కేసుల్లో ఇద్దరు ముగ్గురు న్యాయమూర్తులు విచారిస్తున్న కేసుల నుంచి తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచీల పరిశీలనలో ఉన్నవీ ఉన్నాయి. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసుల విషయంలో త్వరగా తీర్పు చెప్పాలన్న నియమం ఆచరణలోకి రావడమే లేదు. కేసులు పరిష్కారం అయ్యేలోగా అర్జీ పెట్టుకున్న వారు మరణించిన సందర్భాలూ ఉన్నాయి. కేసులు త్వరగానో కనీసం హేతుబద్ధమైన గడువులోగానో తేలకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అసలు అర్జీ పెట్టుకున్న వారో లేదా ప్రతివాదులో కావాలనే కాలయాపన చేయొచ్చు. లేదా పిటిషనర్ల తరఫున వాదించవలసిన న్యాయవాదులకు నిర్దిష్ట తేదీన కుదరనందు వల్ల కూడా వాయిదా పడొచ్చు లేదా న్యాయమూర్తులు సెలవులో ఉండొచ్చు. మధ్యలో వేసవి సెలవుల్లాంటివి వస్తే కోర్టులు నామమాత్రంగా పని చేస్తాయి. చాలా తక్కువ మంది న్యాయమూర్తులే అందుబాటులో ఉంటారు. వీటన్నింటినీ మించి ఇటీవలి కాలంలో ఏ బెంచి దగ్గరికి ఏ కేసు వెళ్తే ఎలాంటి తీర్పు వస్తుందో ముందే తెలిసిపోతోంది. ఉదాహరణకు ఆరేళ్ల నుంచి జైలులో మగ్గుతున్న ఉమర్ ఖాలిద్ కేసు సుప్రీంకోర్టులో 16సార్లు విచారణకు వస్తే ఒక్కసారి కూడా విచారణే జరగలేదు. అంటే ప్రభుత్వం అరెస్టునే శిక్షగా మార్చాలనుకున్నప్పుడు ఇలాంటి మాయోపాయాలు సహజమే. న్యాయస్థానాల్లో కేసులు ఓ పట్టాన తేలకపోవడానికి అనేక కారణాలు ఉన్నా వ్యవస్థలో ఉన్న లోపాలే ప్రధాన కారణం. వీటిని సరిదిద్దడానికి ఇంతవరకు నికరమైన ప్రయత్నం ఏదీ జరిగిన దాఖలాలు లేవు. కావలసినంత మంది న్యాయమూర్తులు లేరని ఒక ప్రధాన న్యాయమూర్తి సాక్ష±త్తు ప్రధానమంత్రి ఎదుటే కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. ప్రధానమంత్రి చేసిందేమీ లేదు. న్యాయం అంగడి సరుకైపోవడానికి తోడు సహించరాని జాప్యం అంతిమంగా న్యాయమే దక్కకుండా చేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు