. 20లోగా పార్టీ సభ్యత్వాల పూర్తి బ ఇళ్ల స్థలాలపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
. ఆగస్టులో పార్టీ రాష్ట్ర మహాసభలకు సమాయత్తం
. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా ఈనెల 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్ధతు తెలుపుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. ఈ సమ్మెలో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని.. మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. విజయవాడ చంద్రం బిల్డింగ్స్ కేంద్రంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అనేక తీర్మానాలు చేశారు. ప్రస్తుత రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై రామకృష్ణ చర్చించారు. రామకృష్ణ మాట్లాడుతూ, జులైలోగా శాఖ, మండల, జిల్లా మహాసభలను విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 23, 24 తేదీల్లో ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని, వాటి విజయవంతానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా అన్ని 26 జిల్లాల్లో పార్టీ సభ్యత్వాల్ని పూర్తి చేసి..వాటిని కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. ఈనెల 15న తిరుపతిలో జరగనున్న ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మహాసభల సందర్భంగా తలపెట్టిన భారీ ప్రదర్శనకు పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టుకునేందుకుగాను ప్రతి ఇంటికి రూ.5లక్షల హామీపై దాటవేత ధోరణి కొనసాగుతోందన్నారు. నాలుగైదు నెలలుగా దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3 సెంట్ల స్థలం, ఇళ్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇవ్వాలని, సూపర్ 6 హామీల్ని అమలు చేయాలనే డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ధర్నాల తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు. విజయవాడ చంద్రంబిల్డింగ్ నుంచి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.చెంచయ్య, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.