Thursday, May 15, 2025
Homeకాల్పుల విరమణకొనసాగింపు

కాల్పుల విరమణకొనసాగింపు

భారత్‌`పాక్‌ కీలక నిర్ణయం

న్యూదిల్లీ: భారత్‌`పాకిస్థాన్‌ డీజీఎంఓల మధ్య కాల్పుల విరమణపై మే 10న అవగాహన కుదిరిన సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా పరస్పరం విశ్వాసం పాదుకొల్పే చర్యలు పెంపొందించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. ఈ నెల 10న డీజీఎంవోల మధ్య కుదిరిన అవగాహనను కొనసాగించనున్నారు. ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎంవోలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భారత సైన్యం ప్రకటించింది.
‘‘మే 10న ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన అవగాహనకు అనుగుణంగా, సరిహద్దుల్లో అప్రమత్తత స్థాయిని తగ్గించేందుకు వీలుగా విశ్వాసం పెంపొందించే చర్యలను కొనసాగించాలని నిర్ణయించాం. పరిస్థితులు మరింత మెరుగుపడిన కొద్దీ, తదుపరి సమాచారం మీకు తెలియజేస్తాం’’ అని అధికారులు పేర్కొన్నారు. ఈ చర్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
టర్కీ సంస్థపై వేటు
పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుం డగా… కేంద్ర ప్రభుత్వం టర్కీపై చర్యలకు ఉపక్రమించింది. భారత్‌లోని వివిధ విమానాశ్రయాల్లో భద్రతాపరమైన సేవలందిస్తున్న టర్కీ సంస్థ సెలెబి ఏవియేషన్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్‌ రద్దు చేసింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఇదే అంశంపై పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు జమ్మూలో మాట్లాడుతూ జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది భద్రతాపరమైన అంశమని, సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఇలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. టర్కీకి చెందిన సెలెబి ఏవియేషన్‌… భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో భద్రతాపరమైన సేవలు అందిస్తోంది. ‘సెలెబీ ఎయిర్‌పోర్టు సర్వీసెస్‌ ఇండియా’ పేరుతో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘సెలెబీ దిల్లీ కార్గో టెర్మినల్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియా’ మాత్రం దిల్లీ విమానాశ్రయంలో కార్గో సేవలు అందిస్తోంది. అత్యంత కీలకమైన భద్రతా పనులను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. గ్రౌండ్‌లో విమానాలకు నిర్దేశం చేసే ర్యాంప్‌ సర్వీసులు, విమాన సమతుల్యతను నిర్ధారించే లోడ్‌ కంట్రోల్‌, ప్రయాణికుల బోర్డింగ్‌కు అవసరమైన బ్రిడ్జిలను అనుసంధానం చేయడం, కార్గో, పోస్టల్‌, గోదాముల నిర్వహణ వంటి కీలక వ్యవహారాలను నిర్వహిస్తోంది. మరోవైపు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన వేళ… పాక్‌కు టర్కీ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. డ్రోన్లు, క్షిపణులను పాకిస్థాన్‌కు అందించిన టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘బాయ్‌కాట్‌ టర్కీ’ నినాదం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ట్రావెల్‌ ఏజెన్సీలు అక్కడికి బుకింగ్‌లు నిలిపివేశాయి. పలు యూనివర్సిటీలు కూడా ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి. అక్కడ నుంచి దిగుమతయ్యే వస్తువులు నిషేధించాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు