వినికిడి లోపించిన వాడు మాట్లాడలేడు. మోదీ వ్యవహారం అలాగే ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ తనవల్లే జరిగిందని పదే పదే చెప్తున్నా ‘‘విశ్వ గురువు’’ మోదీ పెదవి విప్పడం లేదు. ఇంతవరకు విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు మాత్రమే చిన్నపాటి వివరణ ఇచ్చారు. ట్రంప్ చేస్తున్న ప్రచారం, దాని మీద వెల్లువెత్తుతున్న విమర్శలు మోదీకి వినిపించడం లేదు కాబోలు. ప్రధానమంత్రితో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ విషయంలో మౌనంగానే ఉన్నారు. ఇలాంటి విషయాలకు సమాధానం చెప్పవలసింది ప్రధానంగా ప్రభుత్వాన్ని నిర్వహించే వారే. కానీ గతంలో రాష్ట్రపతి స్థానంలో ఉన్న వారు కూడా ఇతర దేశాధినేతల మాటలను తప్పుపట్టి ఆ విషయం స్పష్టంగా తోసిపుచ్చిన సందర్భాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం తరఫున కాల్పుల విరమణ గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రం మిశ్రీ మాత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. కాల్పులు విరమిద్దామని పాకిస్థాన్ సైనిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ తనకు ఫోన్‌చేసి కోరారని విక్రం మిశ్రీ తెలియజేశారు. కానీ ప్రధానమంత్రి మోదీగానీ, అయిన దానికీ కాని దానికీ మాట్లాడే మోదీ మంత్రులు నోరు విప్పడం లేదు. ఈ వ్యవహారం మొదలైనప్పటి నుంచి కేంద్ర హోం మంత్రి జాడే కనిపించడం లేదు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రం గురువారం సైనికులతో మాట్లాడుతూ మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోని మాటలను చిలకపలుకుల్లా అప్పగించారు. అందుకని ఆయనా ట్రంప్ గొప్పలు చెప్పుకోవడాన్ని ఖండిరచలేదు. ట్రంప్ తనకు ఆప్త మిత్రుడు అని మోదీ విరామం లేకుండా చెప్తూ ఉంటారు కానీ మిత్ర వాక్యంగానైనా ట్రంప్ చేస్తున్న ప్రచారం నిజం కాదని చెప్పే పాటి సాహసం ప్రదర్శించలేదు. ఇది ట్రంప్ తో నిర్మొహమాటంగా మాట్లాడ్డానికి మోదీకి ఉన్న బెరుకుకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. ట్రంప్ తన జోక్యంవల్లే భారత్-పాక్ మధ్య ఘర్షణ ఆగిందని చెప్పడం అంటే కశ్మీర్ సమస్య రెండు దేశాలకు మధ్య ఉన్న సమస్య మాత్రమే అన్న మన వాదనను తిప్పికొట్టడమే. అంతే కాదు కశ్మీర్ సంస్యను అంతర్జాతీయ సమస్యగా మలచడానికి సాహసించడమే. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని కూడా ట్రంప్ అన్నారు. ఇది కచ్చితంగా భారత్-పాకిస్థాన్ దేశాలమధ్య తగవరి పాత్ర వహించడానికి ఉబలాటం ప్రదర్శించడమే. ట్రంప్ అక్కడితో ఆగలేదు. ఘర్షణ ఆపకపోతే భారత్-పాక్ దేశాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలు నిర్వహించడం కూడా సాధ్యం కాదని అమెరికా వ్యాపార ప్రయోజనాల గురించి బాహాటంగానే చెప్పారు. అంటే ట్రంప్ మాటలు కేవలం శాంతి స్థాపనకు పరిమితమైనవి కావు. వ్యాపార, వాణిజ్య సంబంధాల మీద తమ వైఖరి స్పష్టంగానే చెప్పారు. ఇంత జరిగినా మోదీ ప్రభుత్వం మౌనం ప్రదర్శించడం విచిత్రమే. జాతినుద్దేశించి మోదీ చేసిన ప్రసంగంలోనూ ఈ విషయం ప్రస్తావనకే రాలేదు. అంటే వాస్తవం ఏమిటో చెప్పడానికి మోదీ సాహసించలేకపోయారు. మోదీ మాటేమో కాని ఇది మన దేశానికే తలవంపులు. ఇది మన విదేశాంగ నీతిలోని బలహీనతకు చిహ్నం. ఈ పరిస్థితిని చూస్తే మోదీవన్నీ ప్రగల్బాలే అనుకోవలసి వస్తోంది. దేశవాసుల గౌరవాదరాలను పరిరక్షించవలసిన బాధ్యతను మోదీ విస్మరించినట్టే లెక్క. పైగా విదేశాంగ కార్యదర్శి విక్రం మిశ్రీ చెప్పిన మాటను సమర్థించకపోవడమే. అలాగే శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన మహిళా సైనికాధికారులను బీజేపీ నాయకులే అవమానకరమైన రీతిలో వెన్నాడుతున్నా వారిని అదుపు చేయడానికి మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వాధినేతలు ఎవరూ ఇసుమంత ప్రయత్నం కూడా చేయలేదు.
ఇంతకు ముందు వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విదేశీ నేతలు ఎవరైనా అర్థ జ్ఞానంతోనో, అజ్ఞానంతోనో కాని లేనిపోని వ్యాఖ్యలు చేసినప్పుడు అసలు విషయాన్ని వివరించిన సందర్భాలు ఉన్నాయి. ట్రంప్ తన గొప్ప తనాన్ని ఒక సారి చెప్పి ఊరుకోలేదు. పదే పదే ఆ మాటే అనేక సార్లు చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మార్కో రుబియో సైతం ఒక తటస్థ ప్రదేశంలో చర్చలు జరపడానికి భారత్-పాకిస్థాన్ దేశాలు అంగీకరించాయని చెప్పారు. ఇదీ ఒక రకంగా ఉభయ దేశాల వ్యవహారంలో మూడో పక్షం జోక్యం చేసుకోవడమే. కశ్మీర్ లో పరిస్థితి గురించి బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనవసరమైవ్యాఖ్యలు చేశారు. అప్పుడు అటల్ బిహారీ వాజపేయి సం యుక్త పత్రికా విలేకరుల సమావేశంలో తనదైన శైలిలో ‘‘ఈ ప్రాంతంలో పర్యటించిన తరవాత పరిస్థితి క్లింటన్ ఊహించినట్టుగా లేదని అంగీకరిస్తారనుకుంటాను’’ అని సుతి మెత్తగా చురక అంటించారు. అదే సమయంలో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణ్ అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌కు 2000 సంవత్సరం మార్చి 21న విందు ఇచ్చినప్పుడు ఆయన మొహం మీదే కచ్చితమైన సమాధానం చెప్పారు. కశ్మీర్ సమస్య భారత ఉపఖండంలో అణ్వస్త్రాలు విస్ఫోటక స్థితిలో ఉన్నాయని క్లింటన్ అన్నారు. భారత ఉపఖండం ప్రపంచంలోనే ప్రమాదకరమైన ప్రాంతంగా మారిందని చెప్పారు. క్లింటన్ భారత పర్యటనకు వచ్చే ముందే ఈ మాటలన్నారు. విందు సందర్భంగా ప్రసంగించిన అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ‘‘ఆందోళన కలిగించే ఇలాంటి ప్రకటనలు తీవ్రవాదాన్ని, హింసాకాండను నమ్ముకున్న వారికే ప్రోత్సాహకంగా ఉంటాయని నర్మగర్భంగా చురక అంటించారు. ‘‘మా దగ్గరా అణ్వస్త్రాలు ఉన్నా మొదటి సారి తాము వాటిని ప్రయోగించబోమని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఈ మాటకు కట్టుబడి ఉంటాం. కానీ ప్రమాదం ఏమైనా ఉంటే అది ఈ హామీ ఇవ్వని వాళ్లవల్లే’’ అని నారాయణన్ సూటిగానే సమాధానం ఇచ్చారు. నారాయణన్ వ్యాఖ్యలను అప్పుడు అమెరికా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. నారాయణన్ అన్న మాటలను క్లింటన్ ఖండిరచలేదు. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుల కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి విమానాల్లో కుక్కి ట్రంప్ అవమానకరమైన రీతిలో తిప్పి పంపినప్పుడూ మోదీ ఒక్క మాటైనా అనలేదు. విడ్డూరం ఏమిటంటే ప్రవాస భారతీయులతో కూడిన ఒక విమానం మోదీ అమెరికా నుంచి వచ్చిన విమానం చేరిన సమయానికి కొంచెం అటూ ఇటుగా వచ్చింది. అమెరికా వెనక్కు పంపించాలనుకున్న వారిని కొన్ని దేశాలు తమ విమానాలను పంపి గౌరవప్రదంగా వెనక్కు తీసుకొచ్చాయి. అవన్నీ చాలా చిన్న దేశాలే. కాని తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నాయి. ట్రంప్ మరో అడుగు ముందుకు వేసి భారత్ ను కూడా పాకిస్థాన్ తో కలిపి ఒకే గాటన కట్టి మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉన్న తేడాను, స్థాయిని ట్రంప్ ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా మన దేశాన్ని అవమానించడమే. పొగడ్తలకు అలవాటు పడ్డ మోదీ హయాంలో మరెన్ని అవమానాలు భరించాలో!