ఎంపిక చేయడమే కాకుండా ఏకంగా ప్రతినిధి బృందానికి ఆయననే నాయకుడిగా ..
ఆపరేషన్ సిందూర్ పై విదేశాలకు బ్రీఫింగ్ కోసం అఖిలపక్షం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
నలుగురు ఎంపీల పేర్లు ఇచ్చిన ఖర్గే..అందులో పేరులేకున్నా శశిథరూర్ ను ఎంపిక చేసిన కేంద్రం
బృందం నాయకత్వ బాధ్యతలు శశిథరూర్ కు అప్పగింత
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిలపక్ష బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం తమ తమ పార్టీల తరఫున సభ్యుల పేర్లను సూచించాలని కోరింది. దీనికి స్పందించిన కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎంపీల పేర్లతో కూడిన ఓ జాబితాను కేంద్రానికి సమర్పించింది. ఇందులో ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పేరు లేనేలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి శశిథరూర్ ను ఎంపిక చేయడమే కాకుండా ఏకంగా ప్రతినిధి బృందానికి ఆయననే నాయకుడిగా చేసింది.ప్రతినిధి బృందం కోసం నలుగురు సభ్యుల పేర్లను సూచించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అదే రోజు మధ్యాహ్నానికి ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ ల పేర్లను కాంగ్రెస్ తరఫున పంపించినట్లు తెలిపారు. ఈ జాబితాలో శశి థరూర్ పేరు చేర్చలేదు. అయితే, తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన శశి థరూర్ ఈ అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.