విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు, ప్రజలకు అందుబాటులో లేని విద్యుత్ శాఖ ఏఈపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో విద్యుత్ శాఖ ఏఈపై చర్యలు తీసుకోవాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గంటలు కొద్ది కరెంటు లేక పోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. దీంతో విద్యుత్ శాఖ ఏఈ ప్రజలకు అందుబాటులో లేక ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో ఎవరికి తెలియదన్నారు. ఏఈకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదని విమర్శించారు. కరెంటు పోతే రైతు సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిరాశకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ శాఖ ఏఈపై శాఖా పరమైన చర్యలు తీసుకొని రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దస్తగిరి, నర్సింహులు, నరసయ్య, లక్ష్మన్న, ఆంజనేయ, రాజు, మూకన్న తదితర రైతులు పాల్గొన్నారు.