. సింగయ్య మృతి కేసు నిందితులపై బలవంతపు చర్యలు వద్దు
. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర హైకోర్టులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ ఊరట లభించింది. గుంటూరు జిల్లా జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి ఘటనపై కేసు నమోదయింది. ఈ కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై విచారించిన న్యాయస్థానం ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేస్తూ… తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈనెల 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించిన విషయం విదితమే. జగన్ కాన్వాయ్ వల్లే అతను మరణించాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం నుంచి, జగన్ తరపు న్యాయవాదుల నుంచి వాదోపవాదనలు కొనసాగాయి. జగన్‌తో పాటు కారులో ప్రయాణించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్ పీఏ, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే కారు డ్రైవర్ కాకుండా కారులో ఉన్నవాళ్లపై కేసులెలా పెడతారని హైకోర్టు ప్రశ్నించింది. అటు అనుమతుల సందర్భంగా కొన్ని షరతులు పాటించాలని చెప్పినప్పటికీ, జగన్ పాటించలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభ మేళాలో ప్రమాదం జరిగింది కదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ ప్రమాదానికి ప్రయాణికులు ఎలా బాధ్యత వహిస్తారని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. సింగయ్య మృతి కేసులో జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిలో నిబంధనలు ఉల్లంఘించినట్లు కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఈ విచారణలో పోలీసులు సేకరించిన ఆధారాలు కోర్టుకు అందజేయడానికి సమయం కావాలని కోరింది. సింగయ్య ప్రమాదానికి గురైన సమయంలో అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం ఇవ్వలేదని కోర్టుకు వివరించింది. జగన్ తరపు న్యాయవాదులు దీనికి బదులిస్తూ… ఘటన జరిగినప్పుడు ఒక కారుగా చెప్పిన పోలీసులు… ఎస్పీ వచ్చిన తర్వాత జగన్ ప్రయాణిస్తున్న కారు అని చెప్పి… సెక్షన్లు మార్చినట్లు తెలిపారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతో ఈ కేసు నమోదు చేశారని, జగన్‌కు సరైన బందోబస్తు ఇవ్వడం లేదని, ఈ అంశంపై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయని కోర్టుకు చెప్పారు. జగన్ పర్యటనలో మూడు కార్లతో పాటు 100 మందికి అనుమతిస్తే వందల కార్లు, వేల మందితో ఎలా పర్యటించారంటూ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. జగన్ పర్యటనలో ముగ్గురు చనిపోయారని, సింగయ్య మృతిపై తాము కేసు నమోదు చేశామని, కక్ష సాధింపు అయితే ముగ్గురు మృతికి సంబంధించి కేసు నమోదు చేసే వాళ్లమని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. మొత్తంమీద జగన్‌కు హైకోర్టులో ఊరట నెలకొనడంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు.


