Homeతెలంగాణతెలంగాణలోని పేదలకు తీపి కబురు..పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ...

తెలంగాణలోని పేదలకు తీపి కబురు..పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ…

- Advertisement -

తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత రాష్ట్రంలో నేడు పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త రేషన్‌కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం 11 మంది లబ్ధిదారులకు కార్డులను అందించి, అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. సీఎం కార్డులు పంపిణీ చేసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులు లబ్ధిదారులకు అందనున్నాయి.కొత్తగా జారీ చేస్తున్న 3,58,187 రేషన్‌కార్డుల ద్వారా 11,11,223 మంది లబ్ధి పొందుతారు. అంతేకాకుండా, పాత రేషన్ కార్డుల్లో 4,41,851 మంది కొత్త సభ్యులను చేర్చడం ద్వారా మొత్తం 15,53,074 మందికి ఆహార భద్రత కింద రేషన్‌ ప్రయోజనం కలుగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ పాత కార్డుల్లో కొత్త వ్యక్తుల చేరికతో తెలంగాణ ప్రభుత్వం ఖజానాపై ఏటా అదనంగా రూ. 1150.68 కోట్ల భారం పడుతుందని మంత్రి వివరించారు. ఈ కొత్త కార్డులతో కలిపి తెలంగాణలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95,56,625కు చేరనుండగా.. లబ్ధిదారులు 3 కోట్లు దాటనున్నారు.

తెలంగాణ ప్రజలు గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. పలు దఫాలుగా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఈ ఏడాది జనవరి 26న నాలుగు పథకాలు ప్రారంభించిన సమయంలోనే గ్రామ సభలు, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకున్నారు. మొదట ఏప్రిల్‌లో ఇస్తామని చెప్పినా.. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జులై 14న కొత్త కార్డుల జారీతో లక్షలాది కుటుంబాల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే, రెండు రకాల కార్డులు జారీ చేస్తారా? లేక ఒకే రకమైన కార్డులు జారీ చేస్తారా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇక రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో కుటుంబ సభ్యుడికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే జూన్, జులై, ఆగస్టు కోటా సంబంధించిన బియ్యం పంపిణీ చేశారు. కొత్తగా కార్డులు మంజూరైన వారికీ సెప్టెంబర్ నుంచి రేషన్ ఇవ్వనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు