Homeశిబూసోరెన్‌ కన్నుమూత

శిబూసోరెన్‌ కన్నుమూత

- Advertisement -

న్యూదిల్లీ: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ (81) సోమవారం కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ దిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడిరచారు. ‘మన ప్రియనేత దిషోమ్‌ గురూజీ మనల్ని విడిచివెళ్లిపోయారు. నాకు సర్వం కోల్పోయినట్టుగా ఉంది’ అని ఉద్వేగపూరితంగా రాసుకొచ్చారు. బీహార్‌లో భాగమైన రామ్‌గఢ్‌ జిల్లాలో శిబూసోరెన్‌ జన్మించారు. ఆయన సతీమణి పేరు రూపీ సోరెన్‌. ఆయనకు నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు హేమంత్‌, బసంత్‌, దుర్గా సోరెన్‌. కుమార్తె పేరు అంజలి. 2009లో దుర్గా సోరెన్‌ మృతి చెందారు. బసంత్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సంతాల్‌ కమ్యూనిటీకి చెందిన శిబూ సోరెన్‌… వామపక్ష నేత ఏకే రాయ్‌, కుర్మి మహతో వినోద్‌ బిహారీ మహతోతో కలిసి 1972లో జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం)ను ఏర్పాటు చేశారు. తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో కీలక నేతగా ఎదిగారు. ఆ పోరాట ఫలితంగా 2000లో జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడిరది. 2005లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ… ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా… అక్కడా అదే పరిస్థితి. 1974 నాటి కేసు కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. తన మాజీ కార్యదర్శి హత్య కేసులో దోషిగా తేలడంతో మరోసారి కేంద్రమంత్రి పదవి కోల్పోయారు. ఒక హత్యకేసులో కేంద్రమంత్రి దోషిగా తేలడం అదే తొలిసారి. అయితే దిల్లీ హైకోర్టు తర్వాత ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. శిబూ సోరెన్‌కు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆయన ఎనిమిది సార్లు లోక్‌సభ, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘శిబూసోరెన్‌జీ అట్టడుగు స్థాయి నుంచి ప్రజాజీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. గిరిజనులు, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం కోసం కృషి చేశారు. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబం, అభిమానుల గురించే నా ఆలోచనంతా. ఇప్పటికే హేమంత్‌ సోరెన్‌జీతో మాట్లాడాను’ అని మోదీ ఎక్స్‌ వేదికగా వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు