. చర్చకు విపక్షాల డిమాండ్
. తెరపైకి క్రీడాబిల్లు తెచ్చిన ప్రభుత్వం
. తీవ్ర నిరసన తెలిపిన ప్రతిపక్ష సభ్యులు
. ఉభయసభలు నేటికి వాయిదా
న్యూదిల్లీ: బీహార్‌లో ఎస్‌ఐఆర్ అంశాన్ని చర్చించాల్సిందేనని విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎంపీ శిబూ సోరెన్‌కు నివాళులర్పించిన తర్వాత రాజ్యసభ వాయిదా పడిరది. బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో లోక్‌సభ కార్యకలాపాలు స్తంభించాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తరచూ అంతరాయం కారణంగా ఒక్క బిల్లు కూడా సభ ఆమోదం పొందలేదని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులకు గుర్తు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైనప్పుడు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ… ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి ఎస్‌ఐఆర్‌పై చర్చించాలనే డిమాండ్‌కు మద్దతుగా నినాదాలు చేశాయి. అయితే సోమవారం రెండు కీలక క్రీడా బిల్లులను చర్చకు జాబితా చేశామని, బిల్లులను చర్చించి ఆమోదించకపోతే సభ ఆటగాళ్లకు న్యాయం చేయదని స్పీకర్ స్థానంలో కూర్చున్న జగదాంబికా పాల్ అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ క్రీడా పాలన బిల్లు2025, జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు2015 పై చర్చ జరపాలని బీసీఏ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి కిరెన్ రిజిజు పేర్కొంటూ… ప్రతిపక్ష ఎంపీల నిరసనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బిల్లులు క్రీడా రంగానికి, అథ్లెట్లకు ముఖ్యమైనవని అన్నారు. సభలో గందరగోళం సృష్టించడం, కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం ప్రతిపక్షాలకు సముచితం కాదని తెలిపారు. మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ జాతీయ క్రీడా పాలన బిల్లు`2025 చాలా ముఖ్యమైనదని అన్నారు. చర్చ, ఆమోదం కోసం దీనిని పరిగణించాలని ఆయన సభను కోరారు. 2036 ఒలింపిక్స్ కోసం భారతదేశం బిడ్ చేయబోతోందన్నారు. నిరసన తెలుపుతున్న సభ్యులు తమ సీట్లకు తిరిగి వెళ్లి బిల్లులపై చర్చించడానికి అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కాంగ్రెస్ ఎంపీ ఆర్.సుధ బంగారు గొలుసును లాక్కున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, స్పీకర్ ఓం బిర్లా కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోలీసులను ఆదేశించారని పాల్ సభ్యులకు చెప్పారు. కొనసాగుతున్న గందరగోళం మధ్య, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కస్టమ్స్ సుంకంపై తీర్మానం ప్రవేశపెట్టారు, దీనిని వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు… ప్రతిపక్ష ఎంపీలు ఎస్‌ఐఆర్, ఇతర అంశాలపై నిరసన తెలిపారు.


