రికవరీ పేరుతో డుమ్మా.. రీ-పేమెంట్ నమోదులో గోల్మాల్ ఆరోపణలు
వెలుగు కార్యాలయంలో నిర్లక్ష్యం.. మహిళా సంఘాల సభ్యుల ఆవేదన
విశాలాంధ్ర – విడపనకల్లు: విడపనకల్లు మండల కేంద్రంలోని సూర్యోదయ మండల సమాఖ్య (డీఆర్‌డీపీ–వెలుగు) కార్యాలయంలో అధికారుల సమయపాలన పూర్తిగా గాడి తప్పిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పనివేళల్లో కార్యాలయానికి తాళం వేసి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో, వివిధ గ్రామాల నుంచి వచ్చే పొదుపు మహిళా సంఘాల సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం విశాలాంధ్ర ప్రతినిధి మండల సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించగా, ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉండటంతో పాటు ఒక్క సిబ్బంది కూడా కార్యాలయంలో కనిపించలేదు. వివిధ పనుల నిమిత్తం వచ్చిన మహిళా సంఘాల సభ్యులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.ఈ విషయమై ఏపీఎం కాలనాయక్ను సంప్రదించగా, “స్టాఫ్ అందరమూ గడేకల్ గ్రామంలో లోన్ రికవరీలో ఉన్నాం. కావాలంటే వచ్చి చూసుకోవచ్చు” అని సమాధానమిచ్చారు. మరోవైపు ఏరియా కోఆర్డినేటర్ శివప్రసాద్ స్పందిస్తూ, “అకౌంటెంట్ సెలవులో ఉన్నారు. మిగిలిన వారు ఫీల్డ్ సిబ్బంది. అయినప్పటికీ కార్యాలయం సమయానికి తెరిచి ఉంచాల్సిందే. తాళం వేసి వెళ్లడంపై సమగ్ర విచారణ జరుపుతాం” అని తెలిపారు.ఇదిలా ఉండగా, రికవరీ పేరుతో విధులకు గైర్హాజరవుతున్న అధికారులు రీ-పేమెంట్ నమోదులో కూడా అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిడి వచ్చిన సమయంలో క్రమం తప్పకుండా రుణ వాయిదాలు చెల్లించిన మహిళల చెల్లింపులను, బకాయిలు ఉన్న ఇతర సభ్యుల ఖాతాల్లో ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.దీని ఫలితంగా తిరిగి రుణం కోసం దరఖాస్తు చేసిన సభ్యులకు, “మీ పేరుపై ఇంకా బకాయి ఉంది. ముందుగా అది చెల్లిస్తేనే కొత్త రుణం మంజూరవుతుంది” అంటూ అధికారులు తిరస్కరిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. తమ సమస్యలను వివరించేందుకు కార్యాలయానికి వచ్చిన మహిళా సంఘాల సభ్యులతో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తూ, ప్రశ్నిస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కూడా వారు ఆరోపించారు.ఫీల్డ్‌లో విధులు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, మహిళా సంఘాల ఆఫ్‌లైన్ రికార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లు, కార్యాలయ ఆన్లైన్ డేటా మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని సభ్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్‌లైన్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, ఆన్లైన్ నమోదుపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి వాస్తవాలు వెలికితీయాలని, అవకతవకలకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, కార్యాలయ వేళల్లో కార్యాలయాన్ని తప్పనిసరిగా తెరిచి ఉంచి మహిళా సంఘాల సభ్యులకు సకాలంలో సేవలు అందించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.


