Homeజిల్లాలుతిరుపతిపగులగొడతామన్నవి.. ప్రగల్భాలేనా!

పగులగొడతామన్నవి.. ప్రగల్భాలేనా!

- Advertisement -

స్మార్ట్‌ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందే

  • దోపిడీకి బ్రేక్‌ పడాల్సిందే..
  • ఉత్తరకుమారుని వలే చరిత్రలో మిగిలిపోకండి
  • కార్పొరేట్లకు ఊడిగం మాని ప్రజల పక్షాన నిలవండి
  • విద్యుత్‌ భారం నుంచి విముక్తి కలిగించండి
  • చంద్రబాబు, లోకేష్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సూటి ప్రశ్న
  • ఏపీఎస్పీడీసీఎల్‌ కార్యాలయం ముట్టడి
  • వామపక్ష నేతల నినాదాలతో దద్దరిల్లిన తిరునగరి
    తిరుపతి: పేదలు, రైతుల రక్తాన్ని పీల్చేస్తున్న స్మార్ట్‌ మీటర్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాల్సిందే! అధికారంలోకి వచ్చాక మాట మార్చేసి, కార్పొరేట్‌ దోపిడీకి తల ఒంచేస్తున్న చంద్రబాబు, లోకేష్‌లకు సూటి సవాల్‌ విసిరారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. ‘పగులగొడతామని’ గత ఎన్నికల్లో గగ్గోలు పెట్టిన మీ మాటలు ప్రగల్భాలు కావని నిరూపించుకోండి.. లేకపోతే ఉత్తరకుమారుని వలె చరిత్రలో చెత్తబుట్టలోకి వెళ్లిపోతారు! కార్పొరేట్లకు ఊడిగం చేయడం మాని, ప్రజల పక్షాన నిలబడి విద్యుత్‌ భారం నుంచి విముక్తి కలిగించండి అంటూ ఆయన మండిపడ్డారు. తిరుపతి బైరాగిపట్టెడలోని ఏపీఎస్పీడీసీఎల్‌ కార్యాలయం ముందు వామపక్ష నేతలు చేపట్టిన భారీ ముట్టడి కార్యక్రమంలో ఈ సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. వామపక్ష నినాదాలతో తిరునగరి దద్దరిల్లిపోయింది.. ప్రజల ఆక్రోశం ఆకాశాన్ని తాకింది!
    గత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందం వెనుక భారీ లంచాలు, దోపిడీలు ఉన్నాయని కె.నారాయణ ఆరోపించారు. న్యూయార్క్‌ నుంచి లంచాలు ముట్టినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయని, అందుకే 20 ఏళ్ల పాటు రూ.2 లక్షల కోట్ల భారాన్ని ప్రజల మెడపై మోపేసేలా అదానీతో పాటు మరో ముగ్గురు కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ, కార్పొరేట్లకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ నిర్ణయాలు రైతులు, పేదలకు ఉరితాళ్లుగా మారాయని, లక్షల కోట్ల భారాన్ని మోయలేక ప్రజలు అదోగతి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగర్తాలా, త్రిపుర, అస్సాం, పంజాబ్‌, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరుగుతున్నాయని, ఆంధ్రాలోనూ అదే జరిగితే ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించారు.
    ఇక స్మార్ట్‌ మీటర్ల దోపిడీ వివరాలు వింటే మీకు షాక్‌ తగులుతుంది! కార్పొరేట్‌ కంపెనీలు నిర్దేశించిన కంపెనీల్లోనే రైతులు, వినియోగదారులు విద్యుత్‌ పరికరాలు కొనాలని రూల్స్‌ పెట్టేసి, అధిక ధరలకు దోచేసుకుంటున్నారని కె.నారాయణ వివరించారు.
    ఈఆర్‌సీ అనే కంపెనీతో కలిసి 63కెవి విద్యుత్‌ లైన్‌ అసలు ధర రూ.1,07,392 మాత్రమే కాగా, కొనుగోలు రేటు రూ.2,74,000కి పెంచేసి రూ.1.67 లక్షలు లూటీ చేస్తున్నారని ఆయన ఆధారాలతో సహా వెల్లడిరచారు. ఇలా డబుల్, త్రిబుల్ రేట్లతో అధిక ధరలకు అమ్మేసి, ప్రజల సొమ్మును దోచేసుకుంటున్నారని కె.నారాయణ మండిపడ్డారు. గతంలో చంద్రబాబు తీసుకున్న విద్యుత్‌ నిర్ణయాల వల్లే ఆయన ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. ‘చంద్రబాబూ.. నువ్వు మోడీని నమ్ముకుంటున్నావు, మోడీ అదానీని నమ్ముకుంటున్నాడు. ఇలా వెళ్తే ఇరకాటంలో పడతారు. ప్రజలు కావాలా? లేక మోడీ, అదానీలకు వత్తాసు పలకాలా? తేల్చుకోండి!’ అంటూ ఆయన సూటి ప్రశ్నలు సంధించారు. విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దు చేసి, స్మార్ట్‌ మీటర్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని, లేకపోతే ప్రజల తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంకటరత్నం మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వేసిన బాటలోనే కూటమి నేతలు నడుస్తున్నారా? లేక ప్రజోపకరమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారా? ఇది పాలకులు నిర్ణయించుకోవాల్సిన విషయమని హితవు పలికారు. ఈ ముట్టడి కార్యక్రమంలో వామపక్ష నేతలు పెద్ద ఎత్తున పాల్గొని, స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల ఆక్రోశాన్ని ప్రభుత్వం గమనించకపోతే, మరిన్ని ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి,నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే రాధాకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, నగర కార్యవర్గ సభ్యులు, ఎం శివ, ఎన్ డి రవి, పద్మనాభరెడ్డి, బలరాం, మంజుల, జింక నాగరాజు, మహేంద్ర,రామకృష్ణ ,వైయస్ మనీ, రామచంద్రయ్య,వెంకటేష్, మునీశ్వర్, విజయమ్మ, ప్రమీల, నాగరాజు, సిపిఎం నగర కార్యదర్శి కే వేణుగోపాల్, జిల్లా నాయకులు టి సుబ్రహ్మణ్యం, జై చంద్ర, సాయి లక్ష్మి, ఆర్ లక్ష్మి, మాధవ్, బుజ్జి, నరేంద్ర, సిపిఎంఎల్ నాయకులు బాబు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు