Homeఓటు నమోదుకు ఆధార్‌

ఓటు నమోదుకు ఆధార్‌

- Advertisement -

. పరిగణనలోకి తీసుకోవాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు సమర్పణకు అవకాశం
. బీహార్‌లో అర్హుల ఓట్ల గల్లంతుపై సీరియన్‌
. రాజకీయపార్టీల తీరుపై అసహనం బ ఎస్‌ఐఆర్‌పై విచారణ

న్యూదిల్లీ : బీహార్‌లో ఓటు కోల్పోయిన వారు తిరిగి ఓటు నమోదు చేసుకునేందుకు ఆధార్‌ను సైతం పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆధార్‌ లేదా ఇతర 11 గుర్తింపు పత్రాలను కూడా స్వీకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీహార్‌లో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పై దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తులు సూర్యకాంత్‌, జోయ్‌మాల్యాతో కూడిన సుప్రీం ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా బీహార్‌ రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితాను తొలగించిన 65 లక్షల మందికి ఎందుకు మద్దతుగా నిలబడలేదని పార్టీలను ప్రశ్నించింది. ఎస్‌ఐఆర్‌ అంశంపై రాజకీయ పార్టీలు చొరవ చూపట్లేదన్న సుప్రీంకోర్టు, పార్టీల తీరును తప్పుపట్టింది. 85 వేల కొత్త ఓట్లు నమోదైతే బూత్‌స్థాయి ఏజెంట్ల (బీఎల్‌ఏ)నుంచి కేవలం రెండు అభ్యంతరాలే రావడమేంటని ప్రశ్నించింది. సవరణ క్రమంలో ఓటు కోల్పోయిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాబితా సవరణ ప్రక్రియ ఓటర్లకు సులభతరంగా ఉండాలని కూడా ఈసీకి సూచించింది. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు సమర్పించిన అభ్యంతరాలకు బూత్‌ లెవల్‌ అధికారులు రసీదులు జారీ చేయడం లేదని కొంతమంది పిటిషనర్లు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరిస్తూ…భౌతిక ఫారమ్‌లు సమర్పించిన చోట రసీదును
అంగీకరించాలని కోర్టు బీఎల్‌ఓలను ఆదేశించింది. విచారణ సందర్భంగా భారత ఎన్నికల కమిషన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది రాకేష్‌ ద్వివేది వాదనలు వినిపించారు. ఆగస్టు 14న కోర్టు ఆదేశించిన విధంగా ముసాయిదా జాబితా నుండి తొలగించబడిన ఓటర్ల జాబితా, మినహాయింపులకు గల కారణాలతో సహా వెబ్‌సైట్‌లు, పోలింగ్‌ బూత్‌లలో ప్రచురించబడిరదని తెలిపారు. సమ్మతి అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. జాబితాలను రాజకీయ పార్టీల బీఎల్‌ఏలకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ‘‘ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా (తొలగింపుకు) ఒక్క అభ్యంతరం కూడా దాఖలు చేయలేదు’’ అని ద్వివేది స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా కోర్టు ముందుకు రాలేదని ద్వివేది చెప్పినప్పుడు, సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబాల్‌, డాక్టర్‌ ఏఎం సింఘ్వి తప్పుబట్టారు. బీహార్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ నుండి ఎంపీ మనోజ్‌ రaా తరపున తాను ప్రాతినిథ్యం వహిస్తున్నానని సిబల్‌ చెప్పారు. ఐఎన్‌సి, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, సీపీఐ, ఎన్‌సీపీ ప్రతినిధులు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌ తరఫున తాను కోర్టుకు హాజరవుతున్నానని సింఘ్వి చెప్పారు. జాబితాలో చేర్చడానికి కొత్త ఓటర్లు 2 లక్షలకు పైగా ఫారాలను దాఖలు చేశారని ద్వివేది పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలలో ఏవీ ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయలేదని… వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం భయాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ను పూర్తి చేయడంలో ఎన్నికల కమిషన్‌కు సహాయం చేయడం రాజకీయ పార్టీల విధి అయినప్పటికీ సహకరించడం లేదని ద్వివేది అన్నారు. కాగా, చాలా మంది ప్రజలు రాష్ట్రం వెలుపల వలస కార్మికులుగా పనిచేస్తున్నారని, వారు ఫారంలను దాఖలు చేయలేకపోవచ్చునని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ తరపున హాజరైన న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు. అలాగే, అన్ని నియోజకవర్గాలలో అన్ని రాజకీయ పార్టీలకు బూత్‌ లెవల్‌ ఏజెంట్లు లేరని తెలిపారు. ‘‘అతిపెద్ద ప్రతిపక్ష పార్టీఆర్జేడీ. వారికి సగం నియోజకవర్గాలలో మాత్రమే బీఎల్‌ఏలు ఉన్నారు’’ అని భూషణ్‌ అన్నారు. దీంతో ఏ ఓటరు అయినా వారి ఆధార్‌ కార్డుతో పాటు ఆన్‌లైన్‌లో ఓటుకోసం ఫారం సమర్పించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో బీహార్‌లో మాత్రమే కాక వచ్చే ఎన్నికల్లో ఆధార్‌ కీలకంగా మారిందని భావించొచ్చు.
ఏం జరిగింది?
బీహార్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సవరిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా జాబితా నుంచి తొలగించబడిన వారి పేర్లను తిరిగి చేర్చడానికి ఆధార్‌ కాకుండా ఇతర 11 పత్రాలను మాత్రమే సమర్పించాలని ఈసీ సూచించింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆగస్టు 18న ఈసీ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి సుమారు 65 లక్షల మంది పేర్లు తొలగింపునకు గురయ్యాయి. ‘‘తొలగింపునకు గురైన ఓటర్ల నుంచి ఆధార్‌ కార్డు లేదా ఇతర ఆమోదయోగ్యమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తులు స్వీకరించడానికి అనుమతిస్తాం’’ అని తాజాగా సుప్రీంకోర్టు పేర్కొంది. భౌతికంగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఓటర్లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
రాజకీయ పార్టీలపై అసహనం
ఓటర్ల జాబితా నుంచి పేర్లను సరిచేయడానికి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ముందుకు రాకపోవడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు 1.6 లక్షల మంది ఉన్నప్పటికీ వారి నుంచి కేవలం రెండు అభ్యంతరాలు మాత్రమే దాఖలు కావడమేమిటని ప్రశ్నించింది. అయితే బీఎల్‌ఏలు ఇచ్చిన అభ్యంతరాలను అధికారులు అంగీకరించడం లేదని కొన్ని పార్టీలు వాదించాయి. ఎస్‌ఐఆర్‌లో 85,000 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారన్న ఈసీ వాదనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
అసలు సమస్య ఏంటంటే?
బీహార్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ముందు ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన విషయంపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లలో ముఖ్యంగా పేర్లు తొలగించడం పట్ల ఎలాంటి స్పష్టత లేదా సమర్థత లేదన్న ఆరోపణలు ఉన్నాయి.కాగా బీహార్‌లో ప్రతిపక్ష పార్టీలు ఈసీ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశాయి. సరైన ధృవీకరణ లేకుండా అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆరోపించాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు