రిజర్వాయర్లకు జలకళ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సమర్ధ నీటి నిర్వహణ సత్ఫలితాలు ఇస్తోంది. నీటి నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీనిపై జలవనరులశాఖ అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో వరద నీటిని సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ వివిధ నదీ పరివాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున నీరు సముద్రంలోకి వెళ్లింది. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలతో మన ప్రాజెక్టులు నిండగా… మిగిలిన నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా బేసిన్ల నుంచి జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 1969 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలిసింది. ప్రతీ వర్షపు చుక్కనూ ఒడిసి పట్టాలన్న లక్ష్యం మేరకు ఓ వైపు రిజర్వాయర్లు నింపుతూ… మరోవైపు అన్ని నదీ బేసిన్ల ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దానికి అనుగుణంగా ఈసారి కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నానదీ బేసిన్లలో అన్ని రిజర్వాయర్లలోనూ కలిపి ప్రస్తుతం 80 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయి. కృష్ణానదిపై గల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు గత నెలలోనే నిండాయి. గోదావరి డెల్టాలో పంటల సాగుకు సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 70 టీఎంసీల మేర నీటిని ఆయకట్టుకు విడుదల చేశారు. పెన్నా బేసిన్లో వెలిగోడులో 15 టీఎంసీలు, సోమశిలలో 56 టీఎంసీలు, కండలేరులో 31 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వంశధార బేసిన్లో గొట్టా బ్యారేజీ నుంచి 8 టీఎంసీల నీటిని ప్రభుత్వం ఆయకట్టుకు అందించింది. మొత్తంగా చూస్తే ఆగస్టు 24 నాటికి ప్రధాన జలాశయాల్లో 650 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్లలో కలిపి 309 టీఎంసీల నీటిని ఆయకట్టు అవసరాలకు వినియోగించారు. సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 70 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజీ నుంచి 52 టీఎంసీలు, వంశధార నుంచి 8 టీఎంసీల నీటిని కాలువలకు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా, నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఇప్పటి వరకు 156 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. హంద్రీ-నీవా ప్రధాన కాలువ ద్వారా మల్యాల ఎత్తిపోతల నుంచి రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో ఉన్న లక్షల ఎకరాల ఆయకట్టుకూ సాగునీరు అందిస్తున్నారు. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా బేసిన్ల ద్వారా జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 1969 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలిసింది.


