గిట్టుబాటు ధర లేక దిగాలు
దళారుల చేతిలో విలవిల
విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : ఉల్లి రైతుకు కన్నీరు మాత్రమే మిగిలింది, గిట్టుబాటు ధర దక్కక రైతులు దిగాలు పడుతున్నారు. మార్కెట్లో దళారులు నాణ్యత పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా సీ బెళగల్, గూడూరు, కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, కృష్ణగిరి, పత్తికొండ, ఎమ్మిగనూరు తుగ్గలి, డోన్, వెల్దుర్తి మండలాల్లో రైతులు అధికంగా ఉల్లి సాగు చేస్తారు. 2025`2026 ఖరీఫ్‌లో సాధారణ సాగు 16,577 హెక్టార్లు కాగా ప్రస్తుతం 11,056 హెక్టార్లు సాగు చేశారు. రైతులు ఎకరాకు లక్ష రూపాయల నుంచి రూ.1,30,000 పెట్టుబడి పెడుతున్నాడు. వారం రోజుల నుంచి మార్కెట్‌కు పెద్దఎత్తున రైతులు ఉల్లి పంటను తీసుకు వస్తున్నారు. శుక్రవారం కర్నూలు ఉల్లి మార్కెట్‌కు 2,471 క్వింటాళ్ల ఉల్లి వచ్చి చేరింది. అయితే రెండు రోజుల నుంచి రైతులు గిట్టుబాటు ధర లేక పంటను అమ్ముకోవడానికి మొగ్గు చూపకపోవడంతో మార్కెట్లో పెద్దఎత్తున ఉల్లి నిల్వ ఉండిపోయింది. శుక్రవారం రైతుల నుంచి వ్యాపారులు గరిష్టంగా క్వింటాల్ రూ.1,119, కనిష్టంగా రూ.501, మధ్యమంగా రూ.659 కి ఉల్లిని కొనుగోలు చేశారు. దీంతో రైతులు కనీసం క్వింటాల్ రూ.2,500 అమ్మకం జరిగితే కానీ పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం పంట అమ్మితే రూ.20 వేల నుంచి రూ.30 వేలకు మించి ఎక్కువ వచ్చే అవకాశం లేకపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో ఉల్లి రూ.20 కి తక్కువగా వ్యాపారులు అమ్మడం లేదని, అయితే రైతుల వద్ద నుంచి మాత్రం కిలో రూ.5 నుంచి రూ.10 కి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. రైతులు ఇదేమని ప్రశ్నిస్తే నాణ్యత లేదని సాకు చెబుతున్నారని తెలిపారు. గత ఏడాది కూడా రైతులు పండిరచిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను చేలోనే పశువులకు వదిలి వేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రంజిత్ బాష, జేసీ డాక్టర్ నవ్య, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ మార్కెట్‌కు వెళ్లి ఉల్లి రైతులతో మాట్లాడారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎలా వ్యాపారులను ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఉల్లి పంట భారీగా ఉందని, జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురవడం వలన ఉల్లి నాణ్యత లేకపోవడం వలన అధిక ధరలకు కొనుగోలు చేయలేపోతున్నామని వారు కలెక్టర్‌కు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్… ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు మాత్రం కోడుమూరులో ఉల్లి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. కోడుమూరులో ఉల్లి మార్కెట్ పెట్టడం వలన గూడూరు, సీ బెళగల్, గోనెగండ్ల, దేవనకొండ, పత్తికొండ, తుగ్గలి తదితర ప్రాంతాలకు చెందిన రైతులకు రవాణా చార్జీలు తగ్గుతాయని కలెక్టర్‌ను కోరగా కలెక్టర్ మార్కెటింగ్ అధికారులను అంచనా వేసి ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర క్వింటాల్‌కు రూ.1,200 ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ… అధికారులే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయగా… రైతు సంఘం నాయకులు మాత్రం ప్రభుత్వం రూ.3 వేల గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, నాణ్యత పేరుతో వ్యాపారుల మోసాలను అరికట్టాలని కోరుతున్నారు.


