ఎంపీలకు వామపక్షాల విజ్ఞప్తి
న్యూదిల్లీ: త్వరలో జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా ఐక్యసంఘటన బలపర్చిన అభ్యర్థి విశ్రాంత సుప్రీం కోర్టు జడ్జి బి.సుదర్శన్‌రెడ్డికి వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), ఏఐఎఫ్బి, ఆర్ఎస్పీ శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం సంఖ్యల గురించి కాదు. ఇది భారతదేశ భవిష్యత్తుపై రెండు ప్రాథమికంగా భిన్నమైన దృక్పథాల మధ్య పోటీని సూచిస్తుందని వామపక్షాలు పేర్కొన్నాయి. మన సమకాలీన సంస్కృతిని కాపాడుకోవడానికి ఉపరాష్ట్రపతి, ఎన్నికల సంఘం, గవర్నర్లు వంటి రాజ్యాంగ పదవులను దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి, నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరోధించడానికి ఇది ఒక యుద్ధమని అభివర్ణించాయి. ‘వామపక్షాలుగా మేము, అన్ని ప్రతిపక్ష పార్టీల తరపున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నాము. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక ప్రముఖ న్యాయనిపుణుడే కాక భారత రాజ్యాంగ ప్రధాన విలువలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం పట్ల అచంచల నిబద్ధత గలవారు’ అని ప్రకటించాయి. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే వారంతా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి వారు తీసుకున్న ప్రమాణాన్ని గుర్తుచేసుకోవడం ద్వారా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాయి.
ఎంపీలందరికీ లేఖ రాస్తా: సుదర్శన్‌రెడ్డి
ముంబై: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాల్సిందిగా కోరుతూ ఎంపీలందరికీ లేఖ రాస్తానని ఇండియా ఐక్యసంఘటన ఉపరాష్ట్రపతి అభ్యర్థి బీ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ముంబైలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సిపి (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్లను కలిశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ లేఖ రాస్తానని చెప్పారు. ఉపరాష్ట్రపతిగా పనిచేయడానికి అవకాశం ఇస్తే…తాను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, దానిని కాపాడుతానని తెలిపారు. ‘‘నేను 52 ఏండ్లుగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పోరాడుతున్నాను. రాజ్యాంగమే నా సందేశం. నా గురించి నేను చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు’’అన్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను నామినేట్ చేసింది.


