ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం
జిల్లా ఎస్పీ పి.జగదీష్ పిలుపు
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం 62 వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పి.జగదీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుండీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు. ఈసందర్భంగ ఎస్పీ మాట్లాడుతూ… 1940 దశకంలో వలంటీర్ వ్యవస్థగా ఏర్పాటైన హోంగార్డు వ్యవస్థ ప్రస్తుతం పోలీసుశాఖలో కీలకంగా ఉంటుందన్నారు . హోంగార్డులు పోలీసుశాఖలో అంతర్భాగం అని తెలిపారు. పోలీసులతో సమానంగా సేవలు అందిస్తుండటం అభినందనీయం అన్నారు. సాధారణ డ్యూటీల మొదలు క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పని చేస్తున్నారన్నారు. పోలీసులకు ఏమాత్రం తీసిపోని విధంగా డ్రైవర్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరాల నియంత్రణ, కంప్యూటర్ ఆపరేటింగ్… ఇలా చాలా రకాల విధుల్లో హోంగార్డుల పాత్ర కీలకం అని పేర్కొన్నారు. పోలీసుశాఖ మంచి పని తీరుకు మీ తోడ్పాటు ఉండటం అభినందనీయం. పనికి తగ్గట్టు రివార్డులు, ప్రశంసలు ఉంటున్నాయి అని పేర్కొన్నారు . జిల్లాలో పోలీసులతో పాటు హోంగార్డుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టాం. మునుపెన్నడూ లేని విధంగా పోలీసులతో పాటు హోంగార్డుల పిల్లల చదువుల ప్రోత్సాహంలో భాగంగా మెరిట్ స్కాలర్ షిప్పులు అందజేశాము అన్నారు. పోలీసు యూనిఫాం ధరిస్తున్నందుకు మనమంతా గర్వపడాలన్నారు. పోలీసుశాఖ ప్రతిష్ట పెరిగేలా సమిష్టిగా క్రమశిక్షణతో పని చేయాలన్నారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేకించి హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దర్భార్ నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పోలీసుశాఖ వడ్డీ లేకుండా హోంగార్డులకు ఇచ్చే రుణాలను అధికం చేయాలని, కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరహాలో పి.ఎఫ్ వర్తింపజేయాలని, పదవీ విరమణ పొందేరోజున మిగితా హోంగార్డుల శాలరీ నుండీ ఇచ్చే మొత్తాన్ని పెంచాలని, ఐ.డి కార్డులు జారీ చేయాలని… ఇలా వివిధ సమస్యలపై పిటీషన్లు ఇచ్చారు. ఈ సమస్యలన్నింటినీ సమగ్రంగా విని సాధ్యాసాధ్యాలను బట్టి త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
ఈకార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేష్, ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సి.ఐ లు శ్రీకాంత్, శేఖర్, ఆర్ ఐ రాముడు, ఆర్ ఎస్ ఐ లు జాఫర్, మగ్బూల్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్, లక్ష్మినారాయణ, ఆనంద్, మసూద్, రిపీటర్ నాగరాజు, జిల్లాలోని హోంగార్డులు, ఏ.ఆర్ పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.